కొవిడ్, ఉగ్రవాదంపై పోరు ప్రాధాన్యతలు

భారత్ అమెరికా సంబంధాలను మరింత సమున్నత స్థాయికి తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ,  అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సంకల్పించారు. ద్వైపాక్షిక సంబంధాలను తదుపరి దశకు తీసుకువెళ్లడమే తమ ప్రతిష్టాత్మక అజెండా అని ఇరువురు నేతలు తెలియచేసుకున్నారు. 

బైడెన్ అమెరికా అధ్యక్షులు అయిన తరువాత ఇరువురు నేతలు తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. స్నేహసంబంధాలను పరస్పర ప్రయోజనాల దిశలో పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు వైట్‌హౌస్ అధికార వర్గాలు ఈ సంభాషణ వివరాలను అందించారు. ప్రపంచానికి ఇంతకాలం ఉగ్రవాదం పెను సవాలు విసిరిందని, ఇప్పుడు కొవిడ్ మరో ఉపద్రవంగా దూసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు.

ఈ రెండింటిని సవాలుగా తీసుకుని వాటి నుంచి విముక్తికి సహకరించుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదం, కరోనా, పర్యావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం వంటివి కీలక అంశాలు. వీటి గురించి కలిసికట్టుగా సాగే పోరులో చిత్తశుద్ధితో కలిసి సాగాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. 

పారదర్శక, బహిరంగ ఇండో పసిఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు పాటుపడాలని, ఇరుదేశాల ప్రయోజనాలే కీలక అంశాలు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. నౌకాయానం స్వేచ్ఛకు మద్దతు, ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణ, క్వాడ్ ద్వారా పటిష్ట ప్రాంతీయ సహకార వ్యవస్థల నిర్మాణానికి కలిసి సాగాల్సి ఉందని తెలిపారు. 

అమెరికా 46వ అధ్యక్షులుగా ప్రమాణం చేసిన తరువాత బైడెన్ ఇప్పటివరకూ తొమ్మిది దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. సంప్రదాయం ప్రకారం అమెరికా కొత్త అధ్యక్షులు ముందు ఇరుగుపొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నాయకులతో మాట్లాడటం ఆనవాయితిగా ఉంది.

తరువాతి క్రమంలో బైడెన్ అమెరికా మిత్రపక్ష దేశాల నేతలతో మాట్లాడారు. ఇందులో భాగంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల నేతలతో సంభాషించి తమ దౌత్య రివాజును పాటించారు. ప్రధాన నాటో కూటమి దేశాలు, ఇరుగుపొరుగుదేశాల నేతలతో కాకుండా వెలుపలి దేశాల క్రమంలో బైడెన్ భారత్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడారు. 

భారత్ పట్ల అమెరికా సన్నిహితత్వాన్ని ఈ వైఖరి స్పష్టం చేస్తుందని విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలు, ప్రామాణిక పద్ధతుల పరిరక్షణ అత్యవసరం అని, అమెరికా ఇందుకు ప్రాధాన్యత ఇస్తుందని మోడితో సంభాషణ క్రమంలో బైడెన్ తెలిపారు.

ప్రజాస్వామిక విలువలకు ఉమ్మడిగా కట్టుబడి ఉండటం వల్ల తలెత్తే భావసారూప్యత కీలకపరిణామం అవుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక విలువల అనుబంధమే భారత్ అమెరికాల సంబంధాలకు వెన్నెముక అవుతుందని బైడెన్ తెలిపారు. పలు ప్రపంచ సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ, సరైన విధంగా స్పందిస్తూ ఉండాలని ఈ దశలో ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చారు. 

ఇరు దేశాల ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాలు పలు అంశాలపై కట్టుబడి పనిచేసేందుకు సరైన వాతావరణం ఉందని ఇది ఇప్పుడు మరింత సుస్పష్టం అయిందని అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ ఈ ఫోన్ కాల్ తరువాతి క్రమంలో స్పందించారు.