శివసేనకు సీఎం పదవికి హామీ ఇవ్వలేదు

శివసేనకు సీఎం పదవికి హామీ ఇవ్వలేదు

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాగస్వామిగా ఉన్న శివసేనకు  ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాను హామీ ఇచ్చిన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు.  ముఖ్యమంత్రి పదవి విషయంలో తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

‘మేం ఏది చేసినా బహిరంగంగానే చేస్తాం. రహస్య రాజకీయాలు ఉండవు. హామీలను మేం గౌరవిస్తాం’అని అమిత్‌ షా తేల్చి చెప్పారు. మోదీ పేరుతో ఎన్నికల ప్రచారం చేసి, ఓట్లు సంపాదించిన శివసేన అధినేత ఉద్ధవ్ ‌ థాకరే ఆ తర్వాత మాటమార్చారని ఆరోపించారు. బిహార్‌లో తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఎన్నికల వాగ్దానాన్ని గౌరవిస్తూ నితీశ్‌కుమార్‌కే ముఖ్యమంత్రి  పదవిని వదిలేశామని ఏంటి షా గుర్తు చేశారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని కంకావ్లిలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి ప్రసంగించారు.

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ పాలన తీరు ఆటో రిక్షాకున్న మూడు చక్రాల మాదిరిగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ధ్వజమెత్తారు. ఆటో చక్రాల మాదిరిగా సంకీర్ణలోని పార్టీల ధోరణి ఎవరికి వారే అన్నట్టుగా పొంతనలేకుండా ఉందని ఎద్దేవా చేశారు.  ‘శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన ఎంవీఏ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏర్పడిన అపవిత్ర కూటమి. అధికారం కోసమే ఏర్పడిన సంకీర్ణం’అని విమర్శించారు.

ప్రపంచ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అవసరాల్లో మనమే 70 శాతం  వరకు తీరుస్తున్నామనీ అమిత్ షా చెప్పారు.  ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న రెండు రకాల టీకాలను 14 దేశాలకు ఎగుమతి చేసినట్లు మంత్రి అమిత్‌ షా తెలిపారు. 21 రోజులుగా దేశంలోని 55 లక్షల మందికి టీకా అందించామని పేర్కొన్నారు. 

కోవిడ్‌–19 కట్టడి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సిబ్బంది, 130 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా పనిచేసి మన దేశంలో మహమ్మారిని నిలువరించగలిగామని చెప్పారు. కోవిడ్‌ మరణాల రేటు, రికవరీ రేటులో కూడా మనమే అత్యుత్తమంగా ఉన్నామని గుర్తు చేశారు.