భారతీయ ‘టీ’ పై అంతర్జాతీయ కుట్ర 

భారత తేయాకు పరిశ్రమపై అసత్య ప్రచారం చేసి,  దేశ ప్రతిష్ఠను దిగజార్చేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మన తేయాకును, దేశ ప్రతిష్ఠను మంటగలిపేందుకు కొందరు విదేశాల నుంచి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాంటి శక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయని ప్రధాని మండిపడ్డారు. అసోం, పశ్చిబెంగాల్‌లోని తేయాకు కార్మికులంతా కుట్రదారుల వెనక ఉన్న పార్టీలను నిలదీయాలని ప్రధాని పిలుపిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో ఆదివారం మోదీ పర్యటించారు. సొంటిపూర్‌ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. 

తేయాకు తోటల సాగులో అసోంది ప్రముఖ స్థానం. ఈ నేపథ్యంలో భారతీయ టీపై కుట్ర విషయాన్ని మోదీ ప్రస్తావించారు.ఇటువంటి దాడిని భారత తేయాకు తోటల కార్మికులు సహించరని మోదీ మండిపడ్డారు. రాష్ట్ర హైవేల అభివృద్ధికి సంబంధించిన ‘అసోం మాలా’ పథకాన్ని ప్రారంభించడంతో పాటు రెండు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. ప్రతి రాష్ట్రంలో మాతృభాషలో బోధించే కనీసం ఒక వైద్య కళాశాల, రెండు సాంకేతిక కళాశాలలు ఉండాలని ప్రధాని చెప్పారు.

 కాగా, భారతీయ తేయాకు తోటల్లో అత్యధికంగా పురుగుమందులు వాడుతున్నారంటూ ఇటీవల గ్రీన్‌పీస్‌ స్వచ్ఛంద సంస్థ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ ఇటీవల  రైతుల ఆందోళనలకు మద్దతిచ్చేవారు ఏం చేయాలో తెలియజెప్పే ‘టూల్‌కిట్‌’ను ట్విటర్‌లో షేర్‌ చేసి డిలీట్‌ చేశారు.

మద్దతుగా పోస్టులు పెట్టేందుకు హ్యాష్‌ట్యాగ్‌లనూ ఆ కిట్‌లో పేర్కొన్నారు. మోదీ సర్కారుపై అంతర్జాతీయ సెలబ్రిటీలు విమర్శలు చేయడంలో ఆ టూల్‌కిట్‌ది  ప్రధాన పాత్ర  అంటూ ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. అందులో యోగా, భారత తేయాకు గురించి పేర్కొన్నట్లు ఆరోపించారు.