
ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు దర (ఎంఎస్‌పీ) విధానంపై ఈ చట్టాల ప్రభావం ఉండబోదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఈ నూతన వ్యవస్థలో మండీలపై ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పారు. మండీలు మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటాయని, సేవలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ రెండు వ్యవస్థలు రైతుల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
రైతులు తమ వ్యవసాయోత్పత్తులను తమ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా అమ్ముకోవడానికి కొత్త సాగు చట్టాలు అవకాశం కల్పిస్తాయని భరోసా ఇచ్చారు. వ్యవసాయోత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకుని, సరసమైన ధర పొందడానికి అదనపు అవకాశాలను ఈ చట్టాలు సృష్టిస్తాయని తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విమర్శలకు స్పందిస్తూ నరేంద్ర సింగ్ తోమర్ ట్విటర్ వేదికగా ఈ వివరణ ఇచ్చారు. శరద్ పవార్ సీనియర్ రాజకీయవేత్త అని, ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారని తోమర్ గుర్తు చేశారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి పవార్‌కు బాగా తెలుసునని పేర్కొన్నారు. ఇటువంటి వ్యవసాయ సంస్కరణలను తీసుకురావడానికి ఆయన గతంలో చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. పవార్ చేసిన ట్వీట్లు దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పారు.
వ్యవసాయ సంస్కరణలపై పవార్ తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని తోమర్ విమర్శించారు. శరద్ పవార్ శనివారం ఇచ్చిన ట్వీట్లలో నూతన సాగు చట్టాలు మండీ సిస్టమ్‌ను బలహీనపరుస్తాయని, ఎంఎస్‌పీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోపించారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్