
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆమె తన 2020-21 బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు.
తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా కనీస మద్ధతు ధర ఉండేలా చూస్తామని నిర్మల వ్యవసాయ రంగానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ధాన్యం సేకరణ గురించి ప్రస్తావించారు. దేశంలో ధాన్యం సేకరణ కూడా ఒక స్థిరమైన వేగంతో పెరుగుతన్నదని, దాంతో రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయని నిర్మలా చెప్పారు.
గోధుమల సేకరణకు సంబంధించి 2013-14లో ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం రూ.33,874 కోట్లు మాత్రమేనని, 2019-20 లో అది రూ.62,802 కోట్లకు, 2020-21లో రూ.75,060 కోట్లకు పెరిగిందని ఆమె తెలిపారు. అంతేగాక కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన ఉత్పత్తుల సంబంధించి 2013-14తో పోలిస్తే 2020-21లో పత్తి రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరిగాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
2013-14లో పత్తి సేకరణకు సంబంధించి పత్తి రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ.90 కోట్లు కాగా, 2020-21లో అది రూ.25,000 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ చెల్లింపుల ద్వారా మొత్తం 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ఆమె వెల్లడించారు.
‘ఒకే దేశం… ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నా… వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చని నిర్మలా పేర్కొన్నారు.
ఈ పథకంతో ముఖ్యంగా వలస కార్మికులు లాభపడతారని పేర్కొన్నారు. మరోవైపు తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుడి ఉందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందని నిర్మలా పేర్కొన్నారు.
అసెట్ మానిటైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా మరిన్ని ఎకనామిక్ కారిడార్లను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. రోడ్డు మౌళికసదుపాయాలను పెంచేందుకు ఈ కారిడార్లు పనిచేస్తాయని ఆమె తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ విజన్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆత్మనిర్బర్ భారత్ అన్న భావన కొత్తదేమీ కాదు అని, ఇది 130 కోట్ల మంది ప్రజల మనోభావాలకు అద్దంపడుతుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. రోడ్డు మౌళిక సదుపాయాల్లో భాగంగా.. తమిళనాడులో 3500 కిలోమీటర్ల మేరకు జాతీయ హైవే పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. దీని కోసం సుమారు 1.03 లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు.
పరిశోధనకు పెద్దపీట వేయనున్నది కేంద్ర ప్రభుత్వం. జాతీయ పరిశోధనా సంస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఎఫ్ కోసం 50 వేల కోట్లు కేటాయించారు. ఇవాళ లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ కోసం కేటాయించిన నిధులను రానున్న అయిదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఎన్ఆర్ఎఫ్‌తో పరిశోధనా వాతావరణాన్ని బలోపేతం చేస్తామన్నారు. పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం సంతోషకరమని నిపుణులు రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని శాస్త్రలోకం స్వాగతిస్తున్నది. ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటు కోసం 40 కోట్లు కేటాయించారు.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!