మొదటిసారి బడ్జెట్ లో ఆరోగ్యంకు పెద్ద పీట 

మొదటిసారి బడ్జెట్ లో ఆరోగ్యంకు పెద్ద పీట 
దేశంలో మొదటిసారిగా ఆరోగ్యంపై కీలక ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వృద్ధికి,  ఉద్యోగాల  కల్పనలపై దుర్ష్టి సారిస్తూ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 
 
ఆరోగ్యంపై రూ 2.84 కోట్ల  కేటాయింపులు ప్రకటించారు. గత ఏడాది కేటాయించిన రూ 90,000 కోట్లతో పోల్చుకొంటే ఇది 1.37 శాతం ఎక్కువ. 
ఈ సందర్భంగా ‘ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన’ అన్న పేరుతో కొత్త పథకాన్ని ఆమె సభలో ప్రకటించారు. ఈ పథకం కింద రూ 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్‌ సూచించిన కార్యక్రమాలను కూడా అమలు చేస్తామని ప్రకటించారు.  కొత్తగా తొమ్మిది బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగ శాలలతో పాటు 15 అత్యవసర కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.  కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35వేల కోట్లు ప్రకటించారు. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకే ఈ కేటాయింపులు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

రూ. 2.87 లక్షల కోట్లతో జల్‌జీవన్ పథకం, రూ. 87 వేల కోట్లతో రక్షిత మంచి నీటి పథకం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మెగా టెక్స్‌టైల్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్‌తో పాటు వచ్చే మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వాయు కాలుష్యం నివారణకు రూ 2217 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ 1,41,678 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసేందుకు పథకాలు ఉంటాయన్నారు.

 కేంద్ర బడ్జెట్‌లో కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశంలోని వాహనాల ఫిట్‌నెస్‌కు ప్రత్యేక పరీక్ష విధానం అమలు చేస్తామని చెబుతూ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల కాల పరిమితి విధించారు. 20 ఏళ్లు దాటిన అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనను తీసుకొచ్చారు. 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేయాలని నిర్ణయించారు.

 బ‌డ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాల‌ను నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఇందులో మొద‌టిది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ‌. రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా. మూడోది స‌మ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌. ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న‌. ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు నిర్మ‌లా వెల్లడించారు.

మరో కోటి మందికి ‘ఉజ్వల’ పథకాన్ని విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాలకు ఇంటింటికీ గ్యాస్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో నూతనంగా గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ని ప్రకటించారు. విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్న పంపిణీ సంస్థలను తీసుకొస్తామని పేర్కొన్నారు. మూడు లక్షల కోట్ల వ్యయంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.  విద్యుత్‌తో ముడిపడి వున్న మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠం చేయడానికే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. వీటితో పాటు హైడ్రోజన్ ప్లాంట్‌ను కూడా నిర్మిస్తామని చెప్పారు.

విద్యుత్ రంగంలో పీపీఈ మోడల్ కింద అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. దేశంలో వ్యాపార నౌకలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకు గాను రూ.1624 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నౌకల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు నిర్మలా సీతరామన్ తెలిపారు.

 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. 75 ఏళ్లు దాటిన వారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నామని, చిన్న పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

జీఎస్టీ సరళీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును ఏడాది వరకు పొడగిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీని మరో ఏడాది పాటు పొడగిస్తామని ప్రకటించారు. పన్ను ఎగవేతదారులను పట్టుకోడానికి కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. 

బడ్జెట్ కేటాయింపులు…

– కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు

– పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌

– రక్షిత మంచినీటి పధకాల కోసం రూ.87 వేల కోట్లు

– దేశంలో 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు మంచినీరు

– స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు లక్షా 41 వేల 678 కోట్లు

– రూ.87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు

– ఘనవ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్‌ అర్బన్‌

– తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగం

– 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చే పథకం