కల్నల్ సంతోష్ బాబుకు మహా వీరచక్ర  

గల్వాన్‌లోయలో చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ కర్నల్‌ సంతోష్‌బాబుకు అత్యున్నత సైనిక పురస్కారాల్లో రెండవదైన మహావీర చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రిపబ్లిక్‌ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ పురస్కారాన్ని సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రదానం చేయనున్నారు. 
 
సంతోష్‌తోపాటు నాడు గల్వాన్‌ ఘర్షణలో అమరులైన మరో నలుగురు సైనికులు నాయబ్‌ సుబేదార్‌ నాథూరామ్‌ సోరేన్‌, హవిల్దార్‌ కే పళని, నాయక్‌ దీపక్‌ సింగ్‌, సిపాయి గురుతేజ్‌సింగ్‌లతో పాటు హవల్దార్‌ తాజీందర్‌ సింగ్‌కు వీరచక్ర అవార్డులను ప్రకటించారు. 
 
గతేడాది జూన్‌ 15వ తేదీన జరిగిన గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో గతేడాది ఏప్రిల్‌ 4న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సుబేదార్‌ సంజీవ్‌కుమార్‌కు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు.  ఉగ్రవాదుల నుంచి పౌరుల ప్రాణాలను కాపాడే క్రమంలో అమరుడైన మేజర్‌ అనూజ్‌ సూద్‌తో పాటు ప్రణబ్‌ జ్యోతిదాస్‌, సోనమ్‌ షెరింగ్‌ తమాంగ్‌లకు శౌర్య చక్ర అవార్డులను ప్రకటించారు.   
 
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాడిన కల్నల్ సంతోస్ బాబు వీరమరణం పొందారు. 
 
కల్నల్ సంతోస్ బాబు తెలంగాణలోని సూర్యాపేటలో జన్మించారు. గల్వాన్‌ ప్రాంతంలో విధుల్లో ఉన్న నిర్వహిస్తున్న ‘16 బీహార్‌’ రెజి మెంట్‌కు సంతోష్‌బాబు కమాండింగ్‌ అధికారి. గల్వాన్‌ లోయలో చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్‌ బాబు నేతృత్వంలోని బృందం జూన్‌ 15న చైనా శిబిరం వద్దకు వెళ్లింది. 
 
చైనా సైనికులు సంతోష్‌ను తోశారు. కమాండింగ్‌ అధికారిపై చైనా జులుం ప్రదర్శించడంతో సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చైనా గుడారాలను పీకేశారు. భయంతో డ్రాగన్‌ దళాలు వెనుదిరిగాయి. సింహంలా పోరాడిన సంతోష్‌ సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
 
అయినా వెనక్కు వెళ్లేందుకు నిరాకరించారు. గాయపడినవారిని వెనక్కు పంపారు. అదనపు బలగాలను రప్పించారు. కొద్ది సేపటి తర్వాత చైనా సైనికులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకొన్నారు. పొడవైన మేకులు కలిగిన ఇనుపకడ్డీలతో మన సైనికులపై దాడులు చేశారు.  చైనా సైనికులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ సైనికులు భీకర పోరాటం చేశారు. గల్వాన్‌ ఒడ్డున పర్వతాలపై మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. భారత సైనికులపై రాళ్ల వర్షం కురిపించాయి. సంతోష్‌ తలపై పెద్ద రాయి పడింది. దీంతో ఆయన నదిలోకి ఒరిగిపోయారు. 
కాగా, తెలుగు వారిలో శౌర్య సేనా పతకానికి మేజర్‌ ఎ.శ్రీనివా్‌సరెడ్డి, సేనాపతకాలకు లెఫ్టెనెంట్‌ కల్నల్‌ విజయ్‌కుమార్‌, మేజర్‌ అజయ్‌కుమార్‌, సతీశ్‌సురేశ్‌, సంగిరెడ్డి సంజీవరెడ్డి (మరణం తర్వాత), పరమ విశిష్ట సేవాపతకాలకు లెఫ్టెనెంట్‌ జనరల్‌ యెందూరు వెంకట కృష్ణమోహన్‌, లెఫ్టెనెంట్‌ జనరల్‌ వడ్లమాని షణ్ముక శ్రీనివాస్‌, వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌.రాజేశఖర శర్మ, వి.శ్రీహరి ఎంపికయ్యారు. 
 
సైనిక, నౌక, వాయు సేనల్లో అంకిత భావంతో పనిచేసిన వారి విభాగంలో విశిష్ట సేనాపతకాలకు మేజర్‌ జనరల్‌ పవమాని సురేందర్‌, రియర్‌ అడ్మిరల్‌ వెన్నం శ్రీనివాస్‌, ఎయిర్‌ అడ్మిరల్‌ జొన్నగడ్డ రాజేంద్ర, బ్రిగేడియర్‌ వంగూరు రఘు, కల్నల్‌ ముప్పర్తి సంజీవ్‌, కల్నల్‌ కేవీ పద్మప్రకాశ్‌, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ విష్ణుబొట్ల నాగరాజు శ్రీనివాస్‌, గ్రూప్‌ కెప్టెన్లు కొండూరు అప్పారావు, ఆకెళ్ల రవి నరసింహ శర్మ, హంపాపురం నరసింహను ఎంపిక చేశారు.