
దేశ సరిహద్దుల్లో విస్తరణ ప్రయత్నాలను భారత్ చవిచూసిందని, అయితే ఈ ప్రయత్నాలను మన సాహస సైనికులు విఫలం చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారని గుర్తు చేశారు.
72వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి సోమవారం సాయంత్రం ప్రసంగీస్తూ భారతదేశం శాంతికి కట్టుబడి ఉందని, అయితే దేశ భద్రతను బలహీన పరచే ప్రయత్నాలను పూర్తి సమన్వయంతో తిప్పికొట్టే సామర్థం భారత బలగాలకు ఉందని, దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రపతి భరోనా వ్యక్తం చేశారు.
‘ఏడాదిగా అనేక రకాల ప్రతికూల పరిస్థితులను మనం చవిచూశాం. సరిహద్దుల్లో విస్తరణ ప్రయత్నాలను ఎదుర్కొన్నాం. వాటిని మన వీర సైనికులు విఫలం చేశారు. ఈ లక్ష్య సాధనలో 20 మంది సైనికులు అమరులయ్యారు’ అని చెప్పారు.
అమరవీరులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందని, శాంతినే భారత్ కోరుకుంటున్నప్పటికీ దేశ భద్రతను బలహీన పరచే ఎత్తుగడలను త్రివిధ దళాలు సమష్టిగా, సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు కంకణబద్ధులై ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత్‌కు ఉన్న నిబద్ధత ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసునని పేర్కొన్నారు.
గల్వాన్ లోయ, సియాచిన్ సహా మన సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ భద్రత కోసం అహరహం శ్రమిస్తున్నాయని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. దేశ ఆహార భద్రతకు నిరంతరం కష్టపడే మన రైతన్న తరహాలోనే మన వీర సైనికులు సైతం సరిహద్దుల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని చెప్పారు. మన సైనికుల వీరత్వం, దేశభక్తి, త్యాగస్ఫూర్తికి దేశ ప్రజలంతా గర్విస్తున్నారని రాష్ట్రపతి తన ప్రసంగంలో కొనియాడారు.
ప్రకృతి ప్రకోపాలు, కోవిడ్ మహమ్మారి సహా అనేక సవాళ్లను అధిగమించి దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలను అందిస్తున్న రైతులకు ప్రతి భారతీయుడు శాల్యూట్ చేస్తారని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన రైతాంగం సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా మెరుగైన వ్యవసాయ దిగుబడులను సాధిస్తున్నారని ప్రశంసించారు.
రైతుల సంక్షేమం కోసం భారత్ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. దేశానికి రైతాంగ సేవలు శ్లాఘనీయమని కొనియాడారు. ప్రతి తరం రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చొరవ చూపాలని చెప్పారు. కరోనా వైరస్‌ను దేశం దీటుగా ఎదుర్కొందని, మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు.
కరోనా మహమ్మారితో ముందువరుసలో నిలిచి పోరాడిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల సేవలు మరువలేనవని కొనియాడారు. వైరస్‌తో కుదేలైన మన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని చెప్పారు. వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు దశలవారీగా చేపట్టిన అన్‌లాక్ ప్రక్రియ ఉపకరించిందని నిరూపితమైందని చెప్పారు.
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ అవకాశం వినియోగించుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవితంలో మీ ఎదుగుదలకు మీ ఆరోగ్యం కీలకమని సూచించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?