కేటీఆర్‌ సీఎం కావాలని అంటున్నవారే కొత్త పార్టీ పెడతారు  

కేటీఆర్‌ సీఎం కావాలని అంటున్నవారే ఆయనను సీఎంగా చేస్తే కొత్త పార్టీ పెడతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు చేతగాకపోతే.. మంత్రి కేటీఆర్‌ సీఎం ఎజెండాగా ఎన్నికలకు రావాలని‌ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. 

కేసీఆర్‌కు దమ్ముంటే బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని సవాల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పరిస్థితి బాగాలేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తనను నమ్మే పరిస్థితి లేదని గ్రహించిన కేసీఆర్‌, వారిని నమ్మించడానికి బీజేపీతో పొత్తు పేరిట కొత్త దుకాణం పెట్టారని విమర్శించారు. 

ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీని సంజయ్‌ ఆవిష్కరించారు. అనంతరం, సినీ ఆర్టిస్టు వైభవ్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. 
 
ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. తన అనుచరుల అక్రమ భూ లావాదేవీలకు సహకరించనందుకు రెవెన్యూ వ్యవస్థపైనే సీఎం అవినీతి ముద్ర వేశారని ఆరోపించారు.  కేటీఆర్‌ను సీఎంగా వ్యతిరేకిస్తున్న ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవి ఇప్పిస్తామంటూ రాయబారం పంపుతున్నారని, ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారని చెప్పారు.
 
 తామే అధికారంలోకి రాబోతున్నామని, అలాంటప్పుడు టీఆర్‌ఎ్‌సతో పొత్తు ఎందుకని సంజయ్‌ ప్రశ్నించారు. తహశీల్దార్ల సంఘం డైరీని తాము ఆవిష్కరించాల్సి వచ్చిందంటే ఏం జరగబోతుందో ఊహించుకోవచ్చని చెప్పారు. 

 
కాగా,  కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏ దేశ ప్రజలు కోరుకుంటున్నారో టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలని ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిరం కావాలా? వద్దా? అన్నది కేసీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
ధరణితో ఇంతకు ముందు ఉచితంగా మ్యుటేషన్లు జరిగేవని, ఇప్పుడు రూ.2,500 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం స్పందించలేదని, ఇంకెంతమంది చనిపోతే స్పందిస్తారని మండిపడ్డారు. తక్షణమే ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.