డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావ అరెస్ట్ 

మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావ, కర్ణాటక మాజీ మంత్రి, జనతా పార్టీ నేత దివంగత జీవరాజ్ అల్వా తనయుడైన ఆదిత్య అల్వాను కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో మహాబలిపురం సమీపంలోని ఓ రిసార్టులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 
 
గత ఆగస్టులో కన్నడ నాట డ్రగ్స్ కార్యకలాపాలు బయటకు వచ్చిన వెంటనే నిందితుడిగా ఉన్న ఆదిత్య అల్వా పరారయ్యారు. అండర్ గ్రౌండ్ లో ఉంటూనే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిత్య అల్వా అరెస్టును బెంగుళూరు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సందీప్ పాటిల్ ధృవీకరించారు.  
 
 ఆదిత్య తన ఫామ్ హౌస్ లలో తరచూ పార్టీలు జరుపుకునే వారని, ఈ పార్టీల్లో నిషేధిత డ్రగ్స్వినియోగించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. నటి రాగిణి, సంజన గల్రానిలను అరెస్టు చేసిన తర్వాత శాండిల్ వుడ్  పరిశ్రమకు చెందిన 17 మందికి డ్రగ్స్ కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. 
 
ఆ జాబితాలో ఆదిత్య అల్వా కూడా నిందితుడిగా ఉన్నారు.  గత అక్టోబర్ 15న ముంబైలో ఉంటున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్య అయిన తన సోదరి ప్రియాంక ఇంట్లోనూ సీసీబీ పోలీసులు దాడి చేసి కేసు విచారణకు బెంగళూరులో తమ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేస్తే ప్రియాంక పట్టించుకోలేదు. ఇంతవరకు విచారణకు కూడా రాలేదు.
 
మరో వైపు ఆదిత్య అల్వాతో సంబంధాలున్న అండర్ వరల్డ్ డాన్ ముత్తప్పరాయ్ కుమారుడు రింకీ ఇంటితోపాటు, ఆయనకు సంబంధించిన పలు రిసార్టుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 
 
ఆదిత్య అల్వా బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నిస్తూ కాటన్ పేట్ పోలీసు స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఆదిత్య అల్వా వేసిన పిటిషన్ ను మూడు వారాల క్రితం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆదిత్య అల్వా కోసం గాలింపు ముమ్మరం చేయగా చెన్నైలో పట్టుబడ్డారు.