
చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ చైనా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్వాన్ నగరంలో లాక్‌డౌన్‌కు అధికారులు అదేశాలు జారీ చేశారు.
మొట్టమొదటగా చైనాలోనే పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఆ తరువాత దేశంలో వేగంగా వ్యాప్తి చెందింది. వైరస్ వ్యాప్తి నివారణకు చైనా కట్టుదిట్టమైన చర్చలు తీసుకోవడంతో అంతే వేగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. అప్పటి నుంచి చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు దాదాపు ఐదు నెలల తర్వాత సోమవారం అత్యధికంగా 103 కేసులు నిర్ధారణ అయ్యాయి.
మంగళవారం నాడు 55 కేసులకు పైగా నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో 40 కేసులు ఒక్క హెబీ ప్రావిన్స్‌లోనే నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందువల్లే ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించడంతో పాటు భారీ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
బీజింగ్‌లోని ఓ ప్రాంతంలోనూ ఒక కరోనా కేసు నమోదవ్వడంతో ఆ ప్రాంతాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. అంతేకాకుండా ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఇదిలా ఉండగా, కరోనా కారణంగా చైనాలో గతేడాది మార్చిలో జరగాల్సిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్ని వాయిదా వేసింది. ఆ తరువాత ఆ సమావేశాలను 2021 ఫిబ్రవరి నెలలో హెబీ ప్రావిన్స్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
అయితే హెబి ప్రావిన్స్‌లో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతుండటంతో సమావేశాలను మళ్లీ వాయిదా వేస్తూ ప్రావిన్షియల్ అధికారులు తెలిపారు. అయితే సమావేశాలు ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
అమెరికా వచ్చే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే
ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం