తమిళ మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చేలి 

తమిళ మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చేలి 

తమిళ మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ శ్రీలంకను కోరింది. సామరస్య క్రమంలో భాగంగా మరిన్ని అధికారాల వికేంద్రీకరణకు ఈ చర్యలు తప్పనిసరని పేర్కొంది. కరోనా అనంతర కాలంలో శ్రీలంక కోలుకునే ప్రయత్నాలకు మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. 

ఈ ఏడాదిలో మొదటిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రస్తుతం శ్రీలంకలో వున్నారు. శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్‌ గుణవర్ధనెతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటూ శ్రీలంక సామరస్య, సయోథ్య క్రమానికి భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. శ్రీలంకకు భారత్‌ ఎప్పుడూ ఆధారపడదగిన భాగస్వామి, విశ్వసనీయమైన మిత్రదేశమేనని స్పష్టం చేశారు. 

పరస్పర విశ్వాసం, ప్రయోజనాలు, గౌరవం, సున్నితత్వం ప్రాతిపదికన శ్రీలంకతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము సిద్ధంగా వుంటామని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, శాంతి, ఐక్య శ్రీలంకలో గౌరవం పట్ల తమిళ మైనారిటీలకు గల ఆకాంక్షలను నెరవేర్చేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జైశంకర్‌ కోరారు. 

రాజ్యాంగంలోని 13వ సవరణతో పాటు అర్ధవంతమైన రీతిలో అధికారాల వికేంద్రీకరణపై శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. పర్యవసానంగా శ్రీలంక పురోగతి, సంక్షేమం కచ్చితంగా మరింత మెరుగవుతాయని అభిలాష వ్యక్తం చేశారు.