కాశ్మీర్ సమస్య రావణకాష్టంగా కొనసాగుతూ ఉండడం, భారత్ భూభాగాలను చైనా, పాకిస్థాన్ ఆక్రమించుకోవడం వంటి పరిణామాలకు బాధ్యునిగా భావిస్తున్న తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు భారత్ లో విలీనం కావడానికి నేపాల్ రాజు సిద్దపడినా నెహ్రు అడ్డుపడ్డారని వెల్లడి అవుతున్నది.
హిమాలయ రాజ్యం నేపాల్ భారత్లో విలీనమయ్యేందుకు ముందుకొచ్చినా.. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సున్నితంగా తిరస్కరించారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’లో ప్రస్తావించారు. ఈ మేరకు పొరుగు దేశ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ చేసిన ప్రతిపాదనను నెహ్రూ తోసిపుచ్చారని పేర్కొన్నారు.
నేపాల్ స్వతంత్ర రాజ్యమని.. అది అలాగే ఉండాలని ఆయన కాంక్షించారని తెలిపారు. ఆ సమయంలో నెహ్రూ స్థానంలో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని, సిక్కిం తరహాలో భారత్లో నేపాల్ అంతర్భాగం అయ్యేదని చెప్పుకొచ్చారు.
‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ 11వ అధ్యాయంలో ‘నా ప్రధానమంత్రులు.. భిన్న శైలులు.. భిన్న దృక్పథాలు’ శీర్షికన ప్రణబ్ తాను పనిచేసిన ప్రధానుల గురించి వివరించారు. రాజుల పాలన పోయి నేపాల్లో ప్రజాస్వామ్యం రావాలని నెహ్రూ కోరుకుంటున్న సమయంలో.. ఆశ్చర్యకరంగా త్రిభువన్ ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. రూప పబ్లికేషన్స్ ప్రచురించిన ప్రణబ్ ఆత్మకథ మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది.
కాగా, ప్రజాకర్షక నాయకత్వాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని పేర్కొన్నారు. ఇలాంటి కారణాల రీత్యా 2014 ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు. ‘అసాధారణ నాయకత్వం’ లేకపోవడంతో యూపీఏ ప్రభుత్వం ఒక సాధారణమైనదిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ పార్లమెంటు సమావేశాల్లో తరచూ మాట్లాడాలని, విపక్షాలు చెప్పేదాన్ని తప్పకుండా వినాలని ప్రణబ్ ఆత్మకథలో సూచించారు. ప్రతిపక్షాలను ఒప్పించి, తన వాణిని దేశానికి వినిపించేందుకు పార్లమెంటును వేదికగా చేసుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంటుకు ప్రధాని హాజరయ్యారంటే, వ్యవస్థ పనితీరుపై అది చాలా ప్రభావం చూపుతుందని చెప్పారు.
యూపీఏ హయాంలో తాను పార్లమెంటుకు హాజరవుతూ, ప్రతిపక్ష నేతలతో టచ్లో ఉంటూ, చర్చల ద్వారా క్లిష్టమైన అంశాలను చక్కబెట్టినట్లు మాజీ రాష్ట్రపతి గుర్తుచేశారు. 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు విషయాన్ని రాష్ట్రపతిగా ఉన్న తనతో ప్రధాని మోదీ చర్చించలేదని ప్రణబ్ తెలిపారు. అయితే ఇలాంటి ప్రకటనలు హఠాత్తుగా చేయాల్సినవేనని సమర్థించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు