187 మంది జీఎస్టీ ఎగవేతదారుల అరెస్ట్ 

187 మంది జీఎస్టీ ఎగవేతదారుల అరెస్ట్ 

డేటా ఎనలిటిక్స్, ఇతర ఏజన్సీల నుంచి వచ్చే సమాచారంతో జీఎస్టీ ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం దాడులను ముమ్మరం చేసిందని, దీంతో గత నెలన్నరలోనే 7 వేల మందిపై చర్య తీసుకోవడంతోపాటు 185 మందిని అరెస్టు చేశామని ఆర్ధిక కార్యదర్శి  అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. 

ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటుండడంతో జీఎస్టీ రెవెన్యూ  డిసెంబర్లో రూ. 1.15 లక్షల కోట్లకు మెరుగుపడిందని తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్ ల రాకెట్ కనిపెట్టడంతో గత నెల రోజుల్లోనే 187 మందిని అరెస్టు చేశారని చెప్పారు. అరెస్టయిన వారిలో అయిదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఒక కంపెనీ సెక్రటరీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 

కొంత మంది మేనేజింగ్ డైరెక్టర్లు 40 నుంచి 50 రోజులు జైలులో కూడా ఉన్నట్లు తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఫేక్ ఇన్వాయిసింగ్ కు పాల్పడుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ యూనిట్, బ్యాంకులు, జీఎస్టీ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ను విశ్లేషించి, జీఎస్టీ ఎగవేతదారులను పట్టుకుంటున్నట్లు పాండే వెల్లడించారు. 

జీఎస్టీ ఫేక్ ఇన్వాయిస్ కేసులపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే చర్యలు తీసుకుంటోందని అన్నారు. డేటా అందుబాటులో ఉండటంతో ఏదో ఒక రోజున ఎగవేతదారులు దొరికిపోక తప్పదని పేర్కొన్నారు.