వ్యాక్సిన్ అభివృద్ధి తుది దశలో ఉంది

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చివరి దశలో ఉందని, కరోనాపై సమిష్టిగా ఎలాగైతే పోరాడామో అదే ఐక్యత వ్యాక్సినేషన్ విషయంలో కూడా చూపాలని  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌‌లోని రాజ్‌కోట్‌లో ఏయిమ్స్ కి ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన  చేస్తూ దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరో అడుగు పడిందని సంతోషం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి నూతన ఆరోగ్య మౌలిక సదుపాయాలతో వీడ్కోలు పలకాలని సూచించారు. 

ఈ సంవత్సరం మనం ఎంత ఇబ్బందిపడ్డామన్నది ఈ మౌలిక సదుపాయాలే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంరక్షణార్థమై ఈమధ్య కాలంలో ఆరోగ్యపరంగా చాలా రకాలైన సౌకర్యాలు వచ్చాయని, ఆరోగ్యపరమైన ప్రభుత్వ పథకాల విషయంలోనూ చాలా చైతన్యవంతులయ్యారని ఆయన కొనియాడారు. 

భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఈ మేరకు అవసరమైన ఆలోచనలను స్వీకరించడానికి కానీ, ఇవ్వడానికి  కానీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  దేశం మొత్తాన్ని సురక్షితంగా ఉంచడానికి కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలందరికీ ’ 2020 సంవత్సరం అంకితం చేశామని ఆయన ప్రకటించారు. 

భారీ జనాభా ఉన్న మన దేశం కరోనాతో పోరాటం చేసిందని, అన్ని దేశాలతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తక్కువేనని, సంక్రమించే రేటు కూడా తక్కువేనని చెప్పారు.  ‘‘వ్యాక్సిన్ అభివృద్ధి చివరి దశలో ఉంది. అతి తొందర్లోనే వ్యాక్సినేషన్ వైపు వెళ్తాం. కరోనాను ఎదుర్కోవడంలో ఎలాగైతే ఐక్యతను చూపించారో… వ్యాక్సినేషన్ విషయంలో కూడా దేశ ప్రజలు అదే ఐకమత్యాన్ని చూపించాలి.’’ అని మోదీ పిలుపునిచ్చారు. 

భారతదేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్రం డ్రై రన్ నిర్వహించింది. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం సిద్ధమైంది. జనవరి తొలివారంలో దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.