విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందు దేవతా విగ్రహాలు, ఆలయాలపై దాడులు పెరిగాయని  టీడీపీ సీనియర్ నేత,  కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంపై ప్రత్యక్షంగా దాడి జరుగుతోందని పేర్కొంటూ ఈఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపిచ్చారు. ఆలయాలపై దాడి జరిగితే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దేవదాయ శాఖ మంత్రి స్పందించకపోవటం దురదృష్టకరమని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

ఆలయాలపై దాడిచేయటం హేయమైన చర్య అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని  ఆయన హెచ్చరించారు.  హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా  సీఎం జగన్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.

ఆలయాలను ధ్వంసం చేయటానికే ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ముందు చెత్తవేస్తే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని, రాముడికి జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నిచారు. రామతీర్ధం ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాడుతామని అశోక్ గజపతిరాజు ప్రకటించారు. 

 కాగా,రామతీర్ధం కోదండరాముని ఆలయానికి  శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి చేరుకున్నారు. ఈ సందర్భంగా కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ.. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్ధతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనను సీఎం, ఎమ్మెల్యేలు ఖండించకపోవడం వారి స్వభావానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరి హిందూ సమాజంపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమలానంద భారతి స్వామి డిమాండ్ చేశారు.