రేవంత్ ను నియమిస్తే కాంగ్రెస్ ను వదిలేస్తా 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపీ ఎ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించబోతున్నట్లు ఓకే వంక కధనాలు వెలువడుతుండగా, ఈ మధ్యనే పార్టీలో వచ్చినతనికి ఈ పదవి కట్టబెట్టడం ఏమిటని సీనియర్ నేతలు భగ్గు మంటున్నారు. రెండేళ్లుగా తాత్సార్యం చేస్తూ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించే సరికి ముందుగా కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. 

ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ అసమ్మతిని అధిష్ఠానంపై తెలిపారు. అదే జరిగితే తాను కాంగ్రెస్ పార్టీని వదిలివేస్తానని మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మూడు సార్లు ఎంపీగా ఉన్న వి హనుమంతరావు స్పష్టం చేశారు. 

టీడీపీని నిండా ముంచిన రేవంత్‌రెడ్డి.. పీసీసీ పదవి చేపడితే కాంగ్రెస్‌ పార్టీనీ బొందపెడతాడని విమర్శించారు.   రాహుల్‌ గాంధీపైనా తీవ్ర విమర్శలు చేశాడని, అవి ఎందుకు గుర్తుకు లేవని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. రేవంత్‌పై ఓటుకు నోటు, మనీ ల్యాండరింగ్‌, భూ కబ్జా కేసులు ఉన్నాయని.. అలాంటివాడు అధ్యక్షుడైతే అందరం జైలు చుట్టూ తిరగాలా? అని నిలదీశారు.

‘‘మాస్‌ లీడర్‌ అంటున్న రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓడిపోయాడు. అతడికి ఎంపీ టికెట్టు నేనే ఇప్పించా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్ల బాధ్యత తీసుకుని ఇద్దరిని మాత్రమే గెలిపించాడు. సంగారెడ్డిలో పెద్ద మీటింగ్‌ పెట్టి సక్సెస్‌ చేసిన జగ్గారెడ్డి, రెండు మునిసిపాలిటీలను గెలిపించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీకి పనికి రారా?” అంటూ పార్టీ అధిష్ఠానాన్ని నిలదీశారు. 

తెలంగాణకు బద్ద శత్రువైన రేవంత్‌రెడ్డి పీసీసీకి అధ్యక్షుడిగా వచ్చాడంటూ రేపటినుంచి టీఆర్‌ఎస్‌ చెబుతుంది. విజిటింగ్‌ కార్డులు ప్రింట్‌ చేస్తానని నాయకుల చుట్టూ తిరిగిన వ్యక్తికి ఇన్ని కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? అని వీహెచ్‌ ప్రశ్నించారు.   ఇప్పటికైనా సోనియా, రాహుల్‌ తనతో సహా పార్టీ సీనియర్లనందరినీ పిలిచి మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

బీసీలు పార్టీని గెలిపించరని మాట్లాడుతున్నారని.. కానీ, బీసీ నేత డి.శ్రీనివాస్‌ పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని వీహెచ్‌ గుర్తుచేశారు. ముగ్గురు అగ్రకులాల వారు ఉండీ.. 2018 ఎన్నికల్లో పార్టీని గెలిపించలేక పోయారన్నారు. టీపీసీసీని బీసీలకే ఇవ్వాలని, లేదంటే అసలైన రెడ్డికి ఇవ్వాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ ఠాగూర్‌ ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని, సోనియాగాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాడని వీహెచ్‌ ఆరోపించారు. 2018 నుంచి అధిష్ఠానాన్ని ఎన్నిసార్లు అపాయింట్‌మెంటు అడిగినా ఇవ్వట్లేదన్నారు. ఢిల్లీ వారు ఏం చెబితే అది వినాలా అని వీహెచ్‌ మండిపడ్డారు.