
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి మన దేశానికి సంబంధించిన అనేక జాతీయ విధానాలపై చెరగని ముద్ర వేశారని చెబుతూ వాజ్‌పాయి తన కాలంలో టైటాన్ వంటివారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొనియాడారు. భారత దేశ విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్డంలో పరిణామాత్మక పాత్రను పోషించారని తెలిపారు.
వాజ్‌పాయి పోషించిన పాత్ర వల్ల అమెరికాతో సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్లు వాజ్‌పాయి 96వ జయంతి సందర్భంగా శుక్రవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ చెప్పారు. దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాల్లో వాజ్‌పాయి సాహసోపేతమైన, కొన్ని సూక్ష్మభేదాలతో కూడిన సంస్కరణలను ప్రవేశపెట్టారని జైశంకర్ తెలిపారు.
భారత దేశం-అమెరికా సహకారంపై వాజ్‌పాయి విజన్ పురోగమిస్తోందని, మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, నిబద్ధత కారణంగా మరింత వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. గడచిన కాలపు సందేహాలను అధిగమిస్తూ, సమకాలిక సవాళ్ళను ఎదుర్కొనడం, నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై నేడు మనం దృష్టి పెట్టామని చెప్పారు.
వాజ్‌పాయి విజన్ భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో కొత్తదనానికి నాంది పలికిందన్నారు. అప్పటి నుంచి వస్తున్న ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ సంబంధాలను మరింత పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. ఓ జాతిగా మనం సంక్లిష్ట సందర్బాల నుంచి బయటపడాలని చెప్పారు.
ఇరు దేశాల భాగస్వామ్యం అత్యంత సహజమైనదిగా ఎలా మారుతుందో కేవలం వాజ్‌పాయి వంటి ఆత్మవిశ్వాసంగలవారు మాత్రమే మొదట్లో అర్థం చేసుకున్నారని ప్రశంసించారు. అదే సమయంలో రష్యాతో భారత దేశ సంబంధాలు నిలకడగా కొనసాగడానికి వాజ్‌పాయి కృషి కారణమని చెప్పారు.
పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం ప్రాతిపదికపై చైనాతో సంబంధాలను కొనసాగించాలన్న చిత్తశుద్ధితో కూడిన భారత దేశ వైఖరి కూడా వాజ్‌పాయి ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుందని జైశంకర్ చెప్పారు. ఉగ్రవాదం, నమ్మకం ఒకేసారి సహజీవనం చేయడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. పొరుగు దేశాలకు స్నేహసౌహార్దాలను ప్రసరింపజేశారని తెలిపారు. .
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
అమెరికా వచ్చే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే
ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం