జేసీ ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడంతో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి.
 
సామాజిక మాధ్యమాల్లో కిరణ్‌ అనే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తూ.. పెద్దారెడ్డి, అతని అనుచరులు వాహనాల్లో జెసి ఇంటికి వచ్చి దాడికి దిగారు. అక్కడే ఉన్న కిరణ్‌పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి  
అయితే ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. రెండు రోజుల్లో తాడిపత్రి విడచి వెళ్లకపోతే చంపుతామంటూ  కిరణ్ ను బెదిరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు.