అప్పుల ఎరతో ఆకర్షించి, వేధింపులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న దా‘రుణ’ యాప్‌లపై ఎట్టకేలకు ఆర్బీఐ స్పందించింది. అలాంటి అనధికారిక రుణ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటి ఉచ్చులో పడొద్దని ఒక ప్రకటనలో సూచించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు ఈ రుణయా్‌పల బారిన పడి ఆత్మహత్య చేసుకోవడం.. భారీస్థాయి వడ్డీలు వసూలు చేయడమే కాక, చెల్లింపులు ఆలస్యమైతే మానసికంగా వేధిస్తున్నాయంటూ సదరు యాప్‌లపై మీడియాలో కథనాలు రావడంతో రిజర్వు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాళ్ ఈ ప్రకటన జారీ చేశారు.
ఆర్బీఐ వద్ద నమోదు చేసుకున్న బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా నియంత్రించే సంస్థల నుంచి (మనీ లెండింగ్ యాక్ట్ వంటివాటి నియంత్రణలో ఉండే సంస్థల నుంచి) మాత్రమే ప్రజలు రుణాలు తీసుకోవాలని ఆర్బీఐ తన ప్రకటనలో సూచించింది.
ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు అందించే సంస్థల వివరాలను ధ్రువీకరించుకోవాలని.. మోసపూరిత యాప్‌ల ఎరకు చిక్కొద్దని హెచ్చరించింది. గుర్తింపులేని వ్యక్తులు, అనధికార యాప్‌లకు కేవైసీ (నో యువర్ కస్టమర్) పత్రాలు అందించవద్దని, అలాంటి వాటిపై https://sachet.rbi.org.in వెబ్‌సైట్ ద్వారా సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
అలాగే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణాలు అందించడానికి రిజర్వు బ్యాంకు అనుమతించిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమతమ యాప్‌లలో వినియోగదారులకు కనిపించేలా సంస్థ పేరును ఉంచాలని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ వద్ద నమోదు చేసుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల పేర్లు, చిరునామాలను https://cms.rbi.org.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఆ సంస్థలపై ఏవైనా ఫిర్యాదులుంటే అదే సైట్‌లో చేయవచ్చని వివరించింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ