భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన సేంద్రియ పంట విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలని, అదే దేశ వ్యవసాయానికి భవిష్యత్ దిక్సూచి అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో వ్యవసాయ రంగంలో విశేష కృషిచేస్తున్న ఐదుగురు రైతులతో సంభాషించారు.
దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని రైతులతో చేస్తున్న మాటామంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపరాష్ట్రపతి ఈ రైతులతో గంటన్నరసేపు మాట్లాడి వారి అనుభవాలను, అనుసరిస్తున్న విధానాలను, ఫలితాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేయడంలో చేపట్టాల్సిన చర్యలను, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు.
సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం ద్వారా ఎదురౌతున్న సమస్యలు, అనంతర ఫలితాల గురించి కూడా చర్చించారు. ప్రస్తుతం దేశంలో ఆహార భద్రత, ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పెరుగుతున్న దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రైతులకు వెంకయ్య నాయుడు సూచించారు. వ్యవసాయరంగంలో మార్పులతోపాటు పౌష్టికాహారాన్ని ఇచ్చే పంటలపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యతను ఆయన ప్రస్తావించారు.
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మేలు రకాలైన వంగడాలను కనుగొని, వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ నాగరత్నం నాయుడు, ఆయన కుమార్తె హర్షిణి, సుఖవాసి హరిబాబు, దేవరపల్లి హరికృష్ణ, బైరపాక రాజు దంపతులు, శ్రీమతి లావణ్యారెడ్డి, రమణారెడ్డి దంపతులు, రైతునేస్తం సంపాదకుడు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతితో కలిసి తమ అనుభవాలను పంచుకోవడంపై వీరంతా ఆనందం వ్యక్తం చేశారు.

More Stories
సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల పాగా!
మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాక్ కు సిడిఎస్ చురకలు
కాంగ్రెస్ ప్రశ్నించిన వంటారాతోనే రేవంత్ ఒప్పందం!