రిపబ్లిక్ డే అతిథిగా బ్రిటన్ ప్రధాని ఖరారు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన అతిధిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తారు. భారత ప్రధాని మోదీ  తనకు పంపిన ఆహ్వానానికి జాన్సన్ అంగీకారం తెలిపారని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. 26వ జనవరి వేడుకలు, కవాతుకు విదేశీ విశిష్ట నేతలను ప్రధాన అతిధులుగా ఆహ్వానించడం ఆనవాయితీగా ఉంది. 

తాను భారత్ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ముఖ్యఅతిధిగా  పాల్గొంటున్నానని జాన్సన్ తెలిపినట్లు డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది ప్రధాని పదవి చేపట్టిన తరువాత, అదే విధంగా ఇయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన తరువాత ప్రధాని జాన్సన్ చేపట్టే తొలి ప్రధాన ద్వైపాక్షిక పర్యటన ఇదే కానుంది.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో బ్రిటన్‌కు భారతదేశంలో అత్యంత కీలకమైన భాగస్వామ్య పక్షం అని జాన్సన్ తెలిపారు. తన భారత్ పర్యటనతో గ్లోబల్ బ్రిటన్‌కు కడు ఉత్తేజభరిత నూతన సంవత్సర శుభారంభం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఓ వైపు భారత్, బ్రిటన్‌లు కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో సహకార ధోరణితో వ్యవహరిస్తున్నాయి. తమ దేశంతో భారతదేశ సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, యుకెతో భారత్ అవిభాజ్య భాగస్వామ్యపక్షం మరింత విస్తరిస్తుందని బ్రిటన్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

1993లో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ తరువాత భారతదేశ గణతంత్ర వేడుకల గౌరవ అతిధిగా వస్తోన్న బ్రిటన్ ప్రధానిగా ఇప్పుడు జాన్సన్ నిలుస్తారు.