
పాకిస్తాన్ లాహోర్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం ఎడమ చేతిని విరగ్గొట్టారు. కుడి చేతి వైపున కూడా ధ్వంసం చేశారు. ధ్వంసానికి పాల్పడిన యువకుడు ఒకరిని గుర్తించిన స్థానిక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
దివంగత మౌలానా ఖాదీమ్ హుస్సేన్ రిజ్వి బోధనల ద్వారా మారిపోయిన సదరు యువకుడు ఇతర మతస్థులపై కోపం పెంచుకుని లాహోర్‌లోని రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
2019 జూన్ 27 న దిగ్గజ పాలకుడి 180 వ వార్షికోత్సవం సందర్భంగా బ్రిటన్‌కు చెందిన సర్కార్ ఖల్స్ ఫౌండేషన్ (ఎస్‌కేఎఫ్) హవేలీ మహారాణి జిందన్ సమీపంలోని లాహోర్ కోటలో మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కాంస్యంతో చేసిన ఈ విగ్రహాన్ని ఫకీర్ ఖానా మ్యూజియం మార్గదర్శకత్వంలో స్థానిక కళాకారులు చెక్కారు.
చక్రవర్తి గుర్రంపై కూర్చుని, కత్తిని ఝులిపిస్తున్నట్లుగా ఉంటుంది. లాహోర్‌లోని హర్బన్‌స్పురా ప్రాంతంలో నివసిస్తున్న జహీర్ విచారణ సమయంలో తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వి తన బోధనలలో రంజిత్ సింగ్ తన పాలనలో చాలా మంది ముస్లింలను చంపాడని బోధించడంతో రంజిత్‌సింగ్‌పై సదరు యువకుడు కోపం పెంచుకుని ధ్వంసానికి పాల్పడ్డాడు.
గత ఏడాది ఆగస్ట్ నెలలో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన సమయంలో కూడా కేంద్రంపై కోపంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే విగ్రహాన్ని అపవిత్రం చేశారు. నిందితులు మౌలానా ఖాదీమ్ రిజ్వి స్థాపించిన తెహ్రీక్-లాబ్‌బాయిక్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక