వ్యవసాయ చట్టాలకు హర్యానా రైతుల మద్దతు 

వ్యవసాయ చట్టాలకు హర్యానా రైతుల మద్దతు 

హర్యానాకు చెందిన రైతు ప్రతినిధులు కొందరు గత సాయంత్రం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో సమావేశమై కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వీరంతా మద్దతు తెలిపారు. హర్యానాలో 70 వేల మంది రైతుల తరపున తాము వచ్చామని ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. మరో 50 వేల మంది ‘‘ప్రగతిశీల’’ రైతులు తమకు మద్దతుగా ఉన్నారని ఈ ప్రతినిధి బృందం పేర్కొంది. 

కాగా వ్యవసాయ చట్టాలకు సవరణల చేయాలని వీరంతా చెప్పినప్పటికీ నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో మాత్రం ఏకీభవించలేదు. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020, నిత్యవసర సరకుల (సవరణ) చట్టం- 2020 సహా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను యధాతథంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. 

అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), మండీల వ్యవస్థ కూడా ఉండాల్సిందేనని రైతు ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తోమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఇతర రైతుల సంఘాలు కోరుతున్న సవరణలు కూడా చేయాలని కోరారు.

‘‘ఎంఎస్‌పీ, మండీల వ్యవస్థను కొనసాగించాలంటూ రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్లకు మేము మద్దతు ఇస్తున్నాం. అయితే రైతు సంఘాలు కోరుతున్న సవరణలు చేసి కొత్త చట్టాలను కూడా కొనసాగించాలని మేము కోరుతున్నాం..’’ అని హర్యానా రైతులు విజ్ఞప్తి చేశారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనే హర్యానా రైతు ప్రతినిధులు తోమార్‌తో సమావేశం కావడం గమనార్హం.