రాజకీయ ప్రవేశంపై సోమవారం నిర్ణయం ప్రకటిస్తారని ఎదురుచూసిన అభిమానుల ఆశలపై ప్రముఖ తమిళ్ నటుడు రజినీకాంత్ మరోసారి నీళ్లు చల్లారు. రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన రజినీకాంత్ అనంతరం విలేకరులతో వీలైనంత త్వరగా రాజకీయాలపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
త్వరలో తమిళనాడులో శాసనసభకు ఎన్నికలు జరగుతున్న తరుణంలో రజినీకాంత్ రాజకీయాల్లో వస్తారా రారా అనే అంశాలపై చర్చ జరుగుతూ ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా తనను రాజకీయాల్లో రావద్దని డాక్టర్లు సూచించారంటూ రజనీకాంత్ లేఖ రాసినట్లు ఒక లేఖ కొద్దికాలం క్రితం ప్రచారంలోకి వచ్చింది.
అది తాను రాసిన లేఖ కాదని చెప్పిన రజినీకాంత్ తనకు ఆరోగ్య సమస్య ఉన్నది మాత్రం వాస్తవం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశం పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎన్నో రోజుల నుంచి రజినీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరగుతున్నప్పటికీ ఇంతవరకు రాజకీయపార్టీని ప్రకటించలేదు. కాగా జనవరిలో రజినీ పార్టీని ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ‘‘జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? కొన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరు ఏమాత్రం బాగోలేదు. మీరు కష్టపడితేనే మనం తరువాతి మెట్టు ఎక్కగలం.’’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
కాగా, 2021 కల్లా తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని కూడా సంకేతం ఇస్తున్నారు. తన అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

More Stories
జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో కాంగ్రెస్ బెదిరింపులు
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!
ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదనుకుంటా!