
శుక్రగ్రహంపై పరిశోధన కోసం ఇస్రో చేపట్టనున్న ‘శుక్రయాన్’ మిషన్ లో తామూ పాల్గొంటామని ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్ దేశాలు ముందుకొచ్చాయి. వీనస్ (శుక్రగ్రహం) ఆర్బిటర్ లో తమ పేలోడ్లూ (శాస్త్రీయ పరికరాలు) కూడా పంపుతామని కోరుతూ ఇస్రో ముందు ప్రతిపాదనలు ఉంచాయి.
వీనస్ ఆర్బిటర్ లో పేలోడ్లను పంపేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలంటూ ఇస్రో ఇదివరకే చేసిన ప్రకటనకు మనదేశంతో పాటు ఆయా దేశాల నుంచి భారీగా స్పందన వచ్చింది. చివరగా 20 పేలోడ్ ప్రతిపాదనలను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో ఇప్పటికే ఫ్రాన్స్ కు చెందిన ‘వైరల్ (వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్పెరిక్ గ్యాస్ లింకర్)’ పరికరాన్ని ఓకే చేశామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
వీనస్ ఆర్బిటర్ మిషన్ ను జూన్ 2023లోనే చేపట్టాలని ఇస్రో తొలుత అనుకున్నా, కరోనా విపత్తు కారణంగా ఈ మిషన్ గడువు మరింత ముందుకు జరిగింది. శుక్రయాన్ ను 2024లో లేదా 2026లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వీనస్ ప్రతి 19 నెలలకు ఓసారి భూమికి దగ్గరగా వస్తుందని, అలా దూరం తగ్గే సమయాన్ని చూసుకుని మిషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వీనస్ ను శాస్త్రవేత్తలు భూమికి కవల సోదరిగా చెప్తుంటారు. వీనస్ బరువు, సైజు, గ్రావిటీ భూమిలాగే ఉంటాయి.
ఈ రెండు గ్రహాలు 450 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడ్డాయని, వీటి పుట్టుకకు మూలం ఒక్కటేననీ భావిస్తారు. అయితే వీనస్ మన కంటే సూర్యుడికి 30 శాతం దగ్గరగా ఉండటం వల్ల ఆ గ్రహంపై సూర్యుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది.
వీనస్ పై 1960ల నుంచే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్ మాత్రమే ఇక్కడికి అంతరిక్ష నౌకలను పంపాయి. ఇప్పటికే వీనస్ గురించి చాలా విషయాలు తెలిసినా.. ఇంకా ఆ గ్రహం ఉపరితలం, దాని కింద ఉన్న ప్రాంతం గురించి తెలియాల్సిన సంగతులెన్నో ఉన్నాయి.
వీనస్ పై వాతావరణం చాలా వేగంగా రొటేషన్ అవుతుండటం, దాని పరిణామం, దానిపై సౌరగాలుల ప్రభావం గురించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటన్నింటిపై దృష్టి సారించేందుకు ఇస్రో వీనస్ ఆర్బిటర్ లో వివిధ పేలోడ్ల (పరికరాలు)ను ఉంచి పంపనుంది. ఈ ఉపగ్రహం నాలుగేళ్ల పాటు వీనస్ చుట్టూ తిరుగుతూ సమాచారం అందించనుంది. మొత్తం 2500 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో 175 కిలోల పేలోడ్లను పంపేందుకు అవకాశం ఉంటుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు