జీహెచ్ఎంసీ ఎన్నికల తీరు దారుణం  

జీహెచ్ఎంసీ ఎన్నికలను జరిపిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని టి ఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజుననే ఎన్నికల నోటిఫికిషన్ విడుదల చేయడం జరగలలేదని స్పష్టం చేశారు.  
 
 తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని అంటూ  వరద బాధితులకు సాయం చేసిన తర్వాత ఎన్నికలు పెట్టొచ్చని, ఇంత గందరగోళంగా ఎన్నికలు పెట్టడం తప్పని అభ్యంతరం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్  పై ప్రజలు అసంతృప్తితో ఉన్నరని చెబుతూ ఆ పార్టీ   సెంటిమెంట్‌తోనే అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మీరు నిజంగా పని చేస్తే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉందని ప్రశ్నించారు. 
 
హైదరాబాదులో రూ. 68 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని అంటూ ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నించారు. నగరంలోని ఫ్లైఓవర్లను కాంగ్రెస్ హయాంలోనే కట్టారని, ప్రస్తుతం వాటి నిర్వహణను కూడా సరిగా చేయడం లేదని ఆరోపించారు.
దుబ్బాక నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాలకు ఆనుకునే ఉంటుందని… అక్కడ జరిగిన ఉపఎన్నికలో ప్రజల ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా అర్థమైందని ధ్వజమెత్తారు.  ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వసనీయతను పెంచుకోవాలని హితవు చెప్పారు.
 
 ఒక రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్  రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఎక్కువ ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం సీనియర్ నేతగా ప్రాధాన్యం దక్కించుకున్న డీఎస్.. టీఆర్‌ఎస్‌లో తనకు అంత గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తిలో కొంతకాలంగా ఉన్నారు.