కేంద్ర బలగాలతో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలి   

కేంద్ర బలగాలతో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలి   

జీహెచ్ఎంసీ ఎన్నికలను కేంద్ర బలగాలు ఉపయోగించి జరపాలని బిజెపి డిమాండ్ చేసింది. గ్రేటర్‌ ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను సరిచేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినల్టు బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బీజేపీకి అనుకూలమైన ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించిన విషయాన్ని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకు వచ్చారు.

స్థానిక అధికారులను ప్రిసైండింగ్ అధికారులుగా నియమించవద్దని స్పష్టం చేస్తూ కేంద్ర, ఇతర జిల్లాల అధికారులతో మాత్రమే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. దుబ్బాకలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులను గ్రేటర్‌ ఎన్నికలకు దూరంగా పెట్టాలని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ  ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు. అంతేకాదు నామినేషన్‌ రోజు నుంచే లిక్కర్ షాపులను బంద్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పక్క డివిజన్లకు చెందిన ఐదారు వేల ఓట్లు అటు ఇటు మార్చారని ఎన్నికల సంఘానికి తెలిపారు. 

ఇతర ప్రాంతాల పోలీస్‌ అధికారులను మాత్రమే ఎన్నికల్లో నియమించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. హౌస్‌ నంబర్లు ఇవ్వటంలో మున్సిపల్‌ శాఖ విఫలమైందని ధ్వజమెత్తారు. అక్రమ కట్టడాల నివాసాలకు ఇంటి నంబర్లు ఇవ్వకపోవటంతో ఓటర్‌ జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రభాకర్‌ ఆరోపించారు.