పదేళ్లలో రూ 10,000 కోట్లతో 736 డ్యామ్‌ల పటిష్టత

రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 736 డ్యామ్‌లను నిర్వహించడంతో పాటుగా వాటి మెరుగుదలకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డ్యామ్ పునరావాసం, మెరుగుదల కార్యక్రమం రెండు, మూడు దశలను పదేళ్ల ప్రణాళికలో రూ.10,211 కోట్లతో పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మంత్రివర్గ సమావేశం వివరాలను తెలియజేస్తూ చెప్పారు. 

కార్యక్రమం మొదటిదశ 2012లో ప్రారంభించినట్లు చెబుతూ, అది 2020లో ముగిసిందని, దీనిలో ఏడు రాష్ట్రాల్లోని 223 డ్యామ్‌లున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో ఖర్చు చేసే మొత్తలో 80 శాతం నిధులను ప్రపంచబ్యాంక్, మరో సంస్థ అందజేస్తాయి.

పునరావాసం, నిర్వహణ, మెరుగుదల కోసం ముందుగా ఏ డ్యామ్‌లను చేపడతారని అడగ్గా, డ్యామ్‌ల యాజమాన్యం రాష్ట్రాలకు చెందుతుందని, అందువల్లఅవి ప్రాధాన్యతలను నిర్ణయించి తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతాయని మంత్రి చెప్పారు. ఇప్పుడున్న డ్యామ్‌లను పటిష్టం చేయడం, పునర్నిర్మించడం, సామర్థం పెంపు కూడా ఈ పథకంలో భాగంగా ఉండాయి.

దీనికి సంబంధించి అధికారులకు శిక్షణ ఇవ్వడానికి వేరే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది.  ఇప్పుడున్న డ్యామ్‌లలో వాటర్ టూరిజంతో పాటుగా పర్యాటక ఆధారిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు మొత్తం సొమ్ములో నాలుగు శాతం కేటాయించడానికి కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు.

అమెరికా, చైనాల తర్వాత అతి పెద్ద డ్యామ్‌లున్న మూడో దేశం భారత్. దేశంలో మొత్తం 5,334 భారీ డ్యామ్‌లుండగా, 411 డ్యామ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడున్న డ్యామ్‌లలో 80 శాతం 25 ఏళ్లకు పైబడినవి కాగా, వందేళ్లనాటి కొన్ని డ్యామ్‌లు కూడా ఇంకా పని చేస్తున్నాయి. అవన్నీ పాతకాలం టెక్నాలజీని ఉపయోగించి నిర్మించినవి అయినందున వాటి నిర్వహణ, బలోపేతం, సామర్థం పెంపునకు భారీ ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి.