ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ చాలా వరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అదే విధంగా మరణాల సంఖ్య కూడా తగ్గింది. మరోవైపు పాజిటివ్ కేసులకు రెట్టింపుగా కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఉంది. 
అయితే నాలుగైదు జిల్లాల్లో మాత్రం రోజులో ఇంకా ఐదు వందలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు అంతకు ముందు 24 గంటలుగా రాష్ట్రంలో 80,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,765 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. 
తాజాగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,281 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,544 మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఏపీలో ప్రస్తుతం 31,721 యాక్టివ్‌ కేసులు ఉండగా. 7,62,419 మంది కరోనా మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. 

ఏపీలో కొత్తగా గుంటూరులో నలుగురు, కడప, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

తాజాగా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. శనివారం నాడు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆయనకు సూచించారు. 

గత నాలుగైదు రోజులుగా వంశీని కలిసిన కార్యకర్తలు, సన్నిహితులు, నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు.