వాయు కాలుష్యంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది

వాయు కాలుష్యం వల్ల నోవల్ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. గాలి కలుషితమైన ప్రాంతాల్లో నివసించేవారికి కోవిడ్-19 సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా గతంలో కోవిడ్-19 సోకినవారికి కొత్త సవాళ్ళు రావచ్చునని కూడా వారించారు.

చలి కాలం సమీపిస్తుండటం, అష్ట దిగ్బంధనం నిబంధనల్లో సడలింపులు వంటివాటి వల్ల దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఆదివారం ఉదయం గాలి కాలుష్యం ‘పూర్’ కేటగిరీలో ఉంది. 

వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల్లో మంట పుడుతుందని, వైరస్ చొచ్చుకెళ్ళడానికి ఇది అనువైన పరిస్థితి అని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్లు చెప్పారు. గాలి కాలుష్యం స్థాయి పెరగడం వల్ల వైరల్ ఇన్‌ఫ్లుయెంజా వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. 

సాధారణ జలుబు మాదిరిగానే కోవిడ్-19 కూడా పెరగవచ్చునని తెలిపారు. టెస్టింగ్ సెంటర్లకు ఇది పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు. కరోనా వైరస్ సోకినవారికి, ఇతర రోగులకు రోగ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని, సరైన విధంగా పరీక్షలు జరిపి వ్యాధి నిర్థరణ చేయడం సవాలుతో కూడుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే,  భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌లో ఎలాంటి మార్పు (మ్యుటేషన్) లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఇంతవరకూ కరోనా మార్పు జరిగినట్టు ఎలాటి ఆనవాళ్లూ లేవని చెప్పారు. ‘నేను ఈ మేరకు మీకు హామీ ఇవ్వగలుగుతున్నాను’ అని జరిగిన ‘సండే సంవాద్’ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.

వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని మరో ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ వార్తాపత్రికలు చదవడం పూర్తిగా సురక్షితమని భరోసా ఇచ్చారు. 

కోవిడ్-19 వాక్సిన్‌కు సంబంధించి భారత్ లో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, సీరం ఇండియా, భారత్ భయోటెక్‌లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయని తెలిపారు. ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్‌లో వేలాది మంది పార్టిసిపెంట్లు, ఒక్కోసారి 30,000 నుంచి 40,000 మంది పాల్గొంటున్నట్టు చెప్పారు.