సహజ ఇంధనాన్ని అతి చౌకైన ధరలో అందించేందుకు సహజవాయువుల సేకరణ కోసం ప్రామాణిక పద్ధతిలో ఈ-బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతి తగ్గుతోందని, అయితే సహజ వాయువుల ధర నిర్ధారణను పారదర్శకంగా నిర్వహించేందుకు, ఈ-బిడ్డింగ్ ప్రక్రియకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు.
ఈ-బిడ్డింగ్ కోసం మార్గదర్శకాలను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అతి తక్కువ ధరకే భారతీయ కస్టమర్లకు ఇంధనాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సోలార్, బయో ఫ్యూయల్స్, బయో గ్యాస్, సింథటిక్ గ్యాస్ విధానాల ద్వారా ఎనర్జీని అందించాలని చూస్తున్నట్లు తెలిపారు.
కాగా, సహజవాయువు ఫైనాన్సింగ్‌లో సంస్కరణల వల్ల మార్కెట్ పారదర్శకంగా మారుతుందని కేంద్ర మంత్రి భరోసా వ్యక్తం చేశారు. అయితే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనరాదు. ఆ కంపెనీలకు అనుబంధ ఉన్న కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇలా ఉండగా, నియంత్రణలో లేని క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే గ్యాస్ కొనుగోలుకు అనుబంధ సంస్థలను అనుమతిస్తూ బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమైంది. సహజ వాయువు మార్కెటింగ్ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తెర తీసింది.
ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలకు గొప్ప ఉత్సాహాన్నిస్తుండగా, పూర్తి మార్కెటింగ్ స్వేచ్ఛను ఇవ్వడంలో భాగంగానే నాన్-రెగ్యులేటెడ్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను కొనేందుకు అనుబంధ సంస్థలకు అనుమతినిచ్చినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఇకపై అనియంత్రిత క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను రిలయన్స్ తదితర సంస్థలు తమ అనుబంధ సంస్థలకు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. అలాగే కెయిర్న్, ఫోకస్ ఎనర్జీ వంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌కే కాకుండా ఎవరికైనా ఇంధనాన్ని విక్రయించుకోవచ్చని చెప్పారు.
More Stories
భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కుంభమేళాతో ఉత్తర ప్రదేశ్ కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం