మైహోం అక్రమ మైనింగ్ పై సిబిఐ దర్యాప్తు జరపాలి 

మైహోం మైన్స్ కంపెనీ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ విషయంపై విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు నోటీసులు పంపినా పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఆ నోటీసులను రాష్ట్ర మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పక్కకు పెట్టాడని పేర్కొన్నారు. 

మైనింగ్ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియా లేదని, రాష్ట్ర అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్రం సూచించిందని చెబుతూ తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ చెప్పిన విషయాలే  చెబుతున్నానని చెప్పారు. నిపుణుల కమిటీ ఎన్నిసార్లు చెప్పినా కూడా.రాష్ట్ర ప్రభుత్వం మైహోం మైనింగ్ పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 

మైహోం కంపెనీ పర్యావరణ అనుమతులు లేకుండా నల్గొండలో 2001 నుంచి మైనింగ్ చేస్తుందని చెబుతూ ఒకరు అనుమతులు తీసుకున్న మైనింగ్‌ను మరొకరు చేస్తే సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలున్నాయని అరవింద్ గుర్తు చేశారు. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ యాక్ట్ వల్ల దేశానికి లక్ష కోట్ల లాభం చేకూరిందని గుర్తు చేశారు.

కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే జయేష్ రంజన్ మైహోం సంస్థకు దొంగ దారిలో అనుమతులిచ్చారని అరవింద్ ఆరోపించారు. 2016లో కేసీఆర్, చంద్రబాబు సహకారంతో మైహోం సంస్థ అనుమతులు బదిలీ చేసుకుందని తెలిపారు. ప్రస్తుత జగన్ సర్కార్ సైతం జై జ్యోతి సంస్థకు అనుమతులివ్వటం అనైతికమని దుయ్యబట్టారు. 

మై హోం‌ సంస్థకు గుంటూరులో వెయ్యి ఎకరాల అక్రమ మైనింగులున్నాయని చెబుతూ పర్యావరణ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో మైహోం సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరించాలని హితవు చెప్పారు. నేరస్థులను కాపాడవద్దని ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.