కేసీఆర్, కేటీఆర్ దళారుల కంటే మించి దళారులు  

తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ దళారుల కంటే మించి దళారులు, దగాకోరులు అయిపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. వలస పాలనలో పండించిన పంటలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో పండించే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టుతో మస్తు నీళ్లు ఉన్నాయంటున్న కేసీఆర్ మరి రైతులను ఆరుతడి పంటలే ఎందుకు పండించాలంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  
 
 కాళేశ్వరంతో మస్తు నీళ్లు ఉన్నయంటున్నడు. లక్షల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడుతున్నడు. రైతులను మాత్రం ఆరుతడి పంటలు వేసుకొమ్మంటున్నడు. వరి, మక్క, పసుపు వేసుకోవద్దంటున్నడు. ఇట్లయితే.. లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం నీళ్లు ఎటు పోయినయ్? అని నిలదీశారు. 
 
ప్రభుత్వం పైసలన్నీ కాళేశ్వరానికి ఖర్చు పెట్టి, బడ్జెట్ లేక కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదని అర్వింద్ దుయ్యబట్టారు. 
కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇస్తుంటే.. దానికి రాష్ట్ర వాటా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని, అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రాన్ని రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, దివాలా పరిస్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వరి, పసుపు, మక్కలు వేసుకోవద్దు అని కేసీఆర్ దొర చెప్పిండు. సోయా వేసుకొమ్మన్నడు. ప్రభుత్వం ఇచ్చిన సోయా విత్తనాలు మొలకెత్తట్లే. మొలకెత్తితే దిగుబడి రాట్లే.. దిగుబడి వస్తే కేసీఆరే ధర రానియ్యడని పేర్కొన్నారు.
 
కేంద్రం ఎంఎస్ పీలో మక్కకు రూ. 1,850 , సోయాకు రూ. 3,850 ఇస్తున్నది. కానీ, కేసీఆరేమో ప్రొక్యూర్ మెంట్ చేస్తలేడు. కొనుగోలు కేంద్రాలు పెడుతలేడు. దీంతో రాష్ట్ర రైతులు రూ. 1000కి మక్క, రూ.3 వేలకు సోయా అమ్మకుంటూ రైతులు రూ. 800 నుంచి రూ.1,000 నష్టపోతున్నరని అర్వింద్ తెలిపారు.