ప్రధాని ప్రత్యేక విమానం ‘ఎయిరిండియా వన్‌’ 

ప్రధాని ప్రత్యేక విమానం ‘ఎయిరిండియా వన్‌’ 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులు ప్రయాణించేందుకు రూపొందించిన ప్రత్యేక విమానం ‘ఎయిరిండియా వన్‌’ – బి 777 గురువారం అమెరికా నుండి ఢిల్లీ చేరుకుంది. ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుందని అధికారులు తెలిపారు.
 
ఈ విమానంలో క్షిపణి దాడులను ఎదుర్కొనే అధునాతన వ్యవస్థ (ఎస్‌పిఎస్‌)తో పాటు సమర్థవంతంగా పనిచేసే కమ్యూనికేషన్‌ వ్యవస్థ (ఎల్‌ఎఐఆర్‌సిఎం)లు ఉన్నాయని చెప్పారు. వీటిని భారత వైమానిక దళానికి చెందిన పైలెట్లతో పాటు ఎయిర్‌ ఇండియా పైలెట్లు నడపవచ్చని పేర్కొన్నారు. 
 
ఈ రెండు విమానాలు వివిఐపిల ప్రయాణానికి అనుకూలంగా మార్చేందుకు వీలుగా బోయింగ్‌కు పంపడానికి ముందు 2018లో కొన్ని నెలల పాటు భారత్‌ వాణిజ్య సముదాయంలో భాగంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించేందుకు టెక్సాస్‌కు పంపినట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రపతి, ప్రధానులు ఎయిర్‌ ఇండియా బి747లో ప్రయాణిస్తున్నారు. బోయింగ్‌ రూపొందించిన ఈ విమానం షెడ్యూల్‌ ప్రకారం జులైలో భారత్‌కు చేరుకోవాల్సిఉంది.
 
 అయితే కరోనా మహమ్మారి కారణంగా జులైలో, సాంకేతిక కారణాలతో ఆగస్ట్‌లో రెండు సార్లు వాయిదా పడినట్లు తెలిపారు.కాగా, వివిఐపిలకోసం రూపొందించిన మరో బి 777 విమానం త్వరలో భారత్‌కు చేరుకోనుందని చెప్పారు.