
హిందూ మున్నని వ్యవస్థాపకులు, హిందువుల హక్కుల కోశం, వారి ఉనికి కాపాడటం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు జరిపిన రామ గోపాలన్ అస్తమించారు. చలి జ్వరం రావడంతో కొద్దీ రోజుల క్రితం చెన్నైలోని రామచంద్ర మిషన్ హాస్పిటల్ లో ఆయనను చేర్చారు. మొదట కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయినా, తర్వాత పాజిటివ్ గా వచ్చింది. గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం కాపాడటం కోసం వైద్యులు విశేషమైన కృషి చేశారు.
గోపాలన్ ఒక పోరాట యోధుడివలె ఉద్యమాలు నడిపారు. 1984 ఉగ్రవాద దాడిలో ఒక విధంగా రెండోసారి జన్మించారు. తిరిగి ఆయన కోలుకోగలరని హిందూ సంస్థలు, ఆర్ ఎస్ ఎస్ లకు చెందిన వారంతా ఎదురు చూసినా 94 ఏళ్ళ వయస్సులో అస్తమించారు.
రామ గోపాలన్ సెప్టెంబర్ 19, 1927న తంజావూర్ వద్ద గల శీరగాలి వద్ద జన్మించారు. 1945లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. ఎ ఎం ఐ ఇ డిప్లొమాను పూర్తి చేసిన తర్వాత విద్యుత్ బోర్డు లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఉద్యోగం మానివేసి ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా పూర్తిసమయం సమాజ సేవకు వినియోగించారు.
తమిళ నాడులో ప్రాంత ప్రచారక్ స్థాయికి ఎదిగి, ఆ రాష్ట్రంలో సంఘ్ బలోపేతం కావడంలో కీలక పాత్ర వహించారు. 1948లో ఆర్ ఎస్ ఎస్ ను నిషేధించిన సమయంలో, 1975లో అత్యవసర పరిస్థితి సమయంలో తమిళ నాడులో రహస్య జీవనం గడుపుతూ సంఘ్ కార్యం విస్తృతంగా అమలు జరిపారు.
తమిళనాడులో హిందూ వ్యతిరేక భావనలను పెద్ద ఎత్తున వైపతి చేస్తున్న సమయంలో 1980 ప్రాంతంలో ఆయన మార్గదర్శనంలో హిందూ మున్ననిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటనలు జరిపి హిందూ మున్ననిని బలమైన ఉద్యమంగా బలోపేతం చేశారు.
1984లో కొందరు సామజిక వ్యతిరేక శక్తులు ఆయనపై పాశవికంగా దాడి జరిపారు. తలకు, మెడకు బలమైన గాయాలతో కొద్దిపాటిలో మృత్యువు నుండి బయటపడ్డారు. అప్పటి నుండి ఆ గాయాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన కాషాయ టోపీ ధరిస్తూ వస్తున్నారు.
అయితే అటువంటి దాడులు ఆయనలో ఉద్యమ కార్యశీలతను నీరుకార్చలేక పోయింది. మరింత ఉత్సాహంతో పనిచేశారు. ఆయన కార్యదక్షత కారణంగా నేడు తమిళనాడులో బలమైన పునాదములతో హిందూ మున్నని బలమైన శక్తిగా ఎదిగింది. ఆయన అందించిన స్పూర్తితో అనేకమని పోరాట యోధులు ఆయన మార్గంలో నడుస్తున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత