బిహార్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఫడ్నవీస్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్‌ను బీజేపీ అధిష్ఠానం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. ఈ మేరకు అధిష్ఠానం బుధవారం అధికారికంగా ఈ నియామకాన్ని ప్రకటించింది. బీజేపీ అధిష్ఠానం బిహార్ పై దృష్టిసారించిన కొన్ని రోజుల నుంచి ఫడణ్‌వీస్ బిహార్ రాజకీయాల్లో, పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొంటున్నారు.

చాలా సార్లు బిహార్ లో పర్యటించారు కూడా. బిహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్లు పంపకాలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం జరిపే సమయానికి ఈ నియామకం జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో జేపీ న‌డ్డా స‌మావేశ‌మై బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించారు. మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల పోలింగ్‌, జేడీయూ, ఎల్‌జేపీతో సీట్ల స‌ర్దుబాటు వంటి త‌దిత‌ర‌ అంశాల‌పై చ‌ర్చించారు.  జేడీ(యూ) నేత, సీఎం నితీష్‌కుమార్‌ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని బీజేపీ ఇంతకు ముందే ప్రకటించింది.

మరో మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) పెద్ద సంఖ్యలో సీట్లు డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రంలో తాజా పరిణామంలో రాష్ట్ర లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ మాధవ్‌ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజశ్వి యాదవ్‌ను నిన్న అర్ధరాత్రి కలిశారు.

 కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కూటమి గెలిస్తే రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత ఉపేంద్ర కుష్వాహా సీఎం అవుతారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.