బీహార్‌లో ఎన్డీయే కూటమిదే విజయం  

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ భరోసా  వ్యక్తం చేశారు. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
‘ఎన్డీయే ఒకటి.. అందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారమవుతుంది’ అని ఎల్జేపీ, జేడీయూ మధ్య విభేదాలపై స్పందిస్తూ ధీమా వ్యక్తం చేశారు. 
 
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు మూడు దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఓట్లు లెక్కించనున్నారు. సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 
 
లోక్‌సభలోని పాట్నా సాహిబ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా కృషి చేసిందని కొనియాడారు. బీహార్ ప్రజలు ఎన్డీయేను ఆశీర్వదిస్తారని, అభివృద్ధి పనుల కారణంగా నిర్ణయాత్మక ఆదేశంతో అధికారంలోకి రావడానికి సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉందని చెప్పారు.