అక్టోబర్ నుంచి జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్‌

జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ ఒకటి నుంచి అమలు కానున్నది. వాస్తవానికి కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచే దీనిని ప్రారంభించాలని భావించింది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా వేయాల్సి వచ్చింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని జీఎస్టీ నెట్‌వర్క్‌ (జీఎస్టీఎన్‌) సీఈవో ప్రకాశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. 
 
తొలుత రూ.500 కోట్లకుపైగా వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు దీనిని వర్తింపజేయనున్నారు. మొదట రూ.100 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్న కంపెనీలన్నింటికీ వర్తింపజేయాలని భావించినా  వ్యాపార వర్గాల నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించిన మీదట సూక్ష్మ, మధ్యస్థాయి పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చారు. 
 
ఈ విధానం అమలుతో అటు పరిశ్రమలకు ఇటు ప్రభుత్వానికి లాభం కలుగుతుందని జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. కంపెనీ ఉత్పత్తులను విక్రయించే సమయంలో ఈ-ఇన్వాయిస్‌ను జనరేట్‌ చేస్తుంది. దీంతోపాటే ఆటోమెటిక్‌గా ఈ-వే బిల్లు జనరేట్‌ అవుతుంది. కంపెనీ ప్రతి నెల సమర్పించే రిటర్న్‌లో ఈ మొత్తం ఆటోమెటిక్‌గా జమ అవుతుంది. 
 
ఫలితంగా కంపెనీ శ్రమ తగ్గుతుంది. ఈ-ఇన్వాయిస్‌ విలువ మొత్తం కొనుగోలుదారుడి క్రెడిట్‌ ఖాతాలోకి చేరుతుంది. రిటర్న్‌లో కూడా జమ అవుతుంది. దీంతో ఉత్పత్తిదారుడినికి, కొనుగోలుదారుడికి శ్రమ తగ్గుతుంది. నకిలీ డాక్యుమెంట్లు, ఫేక్‌ ఈ-వే బిల్లులు సృష్టించే అవకాశం ఉండకపోవడంతో జీరో దందాకు చెక్‌ పడుతుంది.