పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలానికి చెందిన తెలంగాణ జాగృతి మాజీ అధ్యక్షుడు బొడ్డు అనిల్, నీటిపారుదల సంఘం మాజీ అధ్యక్షుడు పోల్లంపల్లి మల్లేశంతోపాటు వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్కు చెందిన 200 మంది యువకులు బీజేపీలో చేరారు.
వీరికి వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానిస్తూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని కేసీఆర్ మాయమాటలు చెపితే జనం ఓట్లేశారని, తీరా గెలిచాక హామీలన్నీ మరిచిపోయారని విమర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందనుకున్నవారికి చివరికి నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు.
కమీషన్ల కోసమే రూ.70వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. రైతులకు రుణమాఫీ ఇవ్వకపోవడంతో అప్పులు చేసి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతుల్లో వ్యతిరేకత లేకున్నా సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లో ప్రజల ముందు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లీడర్లు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా బీజేపీలో చేరడానికి వచ్చిన యువకులకు వివేక్ అభినందించారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ నేతలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
More Stories
హెచ్సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్కు ఈడీ సమన్లు
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు
కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!