కొడాలి నాని వ్యాఖ్యలపై వీర్రాజు ఫైర్ 

శ్రీ వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వాడిన భాష సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పట్ల ఆ భాష సభ్యత కాదని హితవుచెప్పారు. 

చేతికి, మెడలో రుద్రాక్షలు వేసుకున్న మంత్రి నాని అసలేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? అని ప్రశ్నించారు. రుద్రాక్షల గురించి తాను అడిగితే వాటిని తీయకూడదంటూ గొప్పగా చెప్పిన నాని నేడు హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. 

అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు దూషిస్తారని, వారిని సపోర్ట్ చేస్తారని విమర్శించారు. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడకుండా కేంద్రంలో బీజేపీ త్వరలోనే చట్టం చేస్తుందని సోము వీర్రాజు  వెల్లడించారు. 

ఎంతసేపు ఎదుటి వారిని తిట్టించి నవ్వుకోవడం సమంజసమా? అని ప్రభుత్వం పెద్దలను ఆయన ప్రశ్నించారు. దేవుడిపైన, ధర్మంపైనా నోటికొచ్చినట్లు నాని మాట్లాడుతున్నారని, ఆయన వాడిన భాషను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. 

మంత్రి నాని వెంటనే స్పందించి తన వ్యా్ఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఆంజనేయ స్వామి ఆలయాలలో వినతిపత్రాలు సమర్పిస్తామని వీర్రాజు ప్రకటించారు. 

అలాగే మంత్రి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నానిపై 295, 295ఏ, 153ఏ కింద కేసు నమోదు చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. 

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనా సోము వీర్రాజు విరుచుకు పడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పుష్కరాలలో 30 మంది మృతికి కారకులైన వారు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు చేస్తున్న వ్యాఖ్యలను జనాలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. 

ధర్మం గురించి చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారని, ధర్మరాజు వంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు ధర్మం ఏమైపోయిందని వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేయించిన ఘనత చంద్రబాబుది అని దుయ్యబట్టారు. 

ఇప్పుడు వచ్చి హిందూయిజం, ధర్మం అని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో ఆయన చేసిన పనులను కూడా గుర్తు చేసుకుంటే మంచిందని చంద్రబాబుకు వీర్రాజు హితవు చెప్పారు.

టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాల హయాంలోనూ ఆలయాల కూల్చివేత, హిందూ ధర్మంపై దాడి కొనసాగుతోందని వీర్రాజు మండిపడ్డారు. హిందువులంతా ఏకమై వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని స్పష్టం చేశారు