వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లుల పార్లమెంట్ ఆమోదం పొందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు శుభాభినందనలు తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో టెక్నలాజికల్, నిర్మాణ పరమైన మార్పులు రావాల్సి ఉందని, ఈ బిల్లుల ద్వారా ఆ దిశగా అడుగులు పడ్డాయని కొనియాడారు.
‘ఇంతకు ముందే చెప్పా, ఇప్పుడు మరోమారు చెబుతున్నా. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుంది. ప్రభుత్వ సేకరణ కూడా కొనసాగుతుంది. మేం రైతులకు సేవ చేయడానికే ఉన్నాం. వారికి మద్దతుగా నిలిచే ప్రతి పనిని మేం చేస్తాం. వారి భావి తరాల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తాం’ అని భరోసా ఇచ్చారు .
ఇది భారత్ వ్యవసాయ రంగ చరిత్రలో వాటర్ షెడ్ ఉద్యమం లాంటిదని ప్రధాని పేర్కొన్నారు. ఈ బిల్లుల ఆమోదంతో వ్యవసాయ రంగంలో నవీన మార్పులు వస్తాయని చెబుతూ దశాబ్దాలుగా కొన్ని అవరోధాల వల్ల మధ్యవర్తులు, దళారీల ఒత్తిళ్లు, బెదిరింపుల వల్ల రైతులు బాధలు పడ్డారని విచారం వ్యక్తం చేశారు.
అలాంటి బాధల నుంచి రైతులను బయట పడేయడానికే పార్లమెంట్‌లో ఈ బిల్లులను ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. వీటితో రైతుల ఆదాయం రెట్టింపవడంతోపాటు వారికి చాలా మేలు జరుగుతుందని ప్రధాని తెలిపారు.
మరోవంక, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పలువురు రైతులకు మిఠాయిలు తినిపించారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొన్ని రైతు సంఘాలు ఢిల్లీ విజయ్ చౌక్‌లోని వ్యవసాయ మంత్రి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.
వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోమర్ పలువురు రైతులకు మిఠాయిలు తినిపించారు. 70 ఏండ్లుగా రైతులు అనుభవిస్తున్న అన్యాయం నుంచి వారికి విముక్తి లభించిందని చెప్పారు.
ఇప్పటి వరకు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మండీలో అన్యాయమైన ధరలకు అమ్మవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు వారు సొంతంగా నిర్ణయించిన ధరలకు వాటిని అమ్మ్ముకోవచ్చని చెప్పారు. కనీక మద్దతు ధరలు ఉంటాయన్న తోమర్, ఈ రోజు చారిత్రాత్మక రోజని అన్నారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్కతా పోలీస్ కమిషనర్పై వేటుకు మమతా సమ్మతి