మరో టిడిపి ఎమ్యెల్యే అధికారపక్షం పంచన చేరారు. విశాఖ దక్షణ ఎమ్యెల్యే వాసుపల్లి గణేష్ నేడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి ప్రశంసలతో ముంచెత్తారు. తన కుమారు ఇద్దరికీ ఆయన చేత వైసిపి కండువాలు కప్పించారు.
‘నా కుమారులు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు. ఆయన ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు’అని ఈ సందర్భంగా గణేష్ పేర్కొన్నారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్యెల్యేలు – వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు) టిడిపికి దూరంగా ఉంటూ వైసీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. వయితే సాంకేతికంగా వైసిపిలో చేరడం లేదు. కరణం బలరాం మాత్రం తన కుమారుడిని వైసిపిలో చేర్పించారు. గణేష్ సహితం కొంతకాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు.
అధికారమలోకి వచ్చిన కొత్తలో ఎవరైనా పార్టీ మారితే తక్షణమే వారి సభ్యత్వం పోవాలని, లేదంటే రాజీనామా చేసి వస్తేనే వారిని పార్టీలో చేర్చుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత దొడ్డిదోవన టిడిపి ఎమ్యెల్యేలను దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నం జగన్ చేస్తున్నారు.

More Stories
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన
శ్రీ పద్మావతీ అమ్మవారి వాహనసేవలో తరిస్తున్న శ్రీ రంగం శ్రీవైష్ణవులు