కోసి రైల్‌ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని

బీహార్‌ చారిత్రాత్మక కోసి రైల్‌ మెగా రైల్వే బ్రిడ్జీని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బీహార్‌ రైల్వే అనుసంధానంలో ఈ రోజు చరిత్రలో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు. సుపౌల్‌, ఆరారియా, సహస్ర జిల్లాల ప్రజల రాకపోకలకు ఈ వంతెన ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

రైల్వే వంతెన నిర్మాణంతో నిర్మాలి-సరియాఘర్‌ మధ్య 300 కిలోమీటర్ల దూరం 22 కిలోమీటర్లకు తగ్గింది. 85 ఏండ్ల క్రితం మిథిలా, కోసి పరివాహక ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ బ్రిడ్జి కూలిపొయింది. నాటి నుంచి కోసి నది ప్రవాహం, స్వభావం కారణంగా బ్రిడ్జీ నిర్మాణం సాధ్యపడలేదు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగాయని, అప్పటి రైల్వే మంత్రులు ఈ ప్రాజెక్టు గురించి కనీసం ఆందోళన కూడా చెందలేదని అందు పరోక్షంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై మోదీ మండిపడ్డారు. 

లాలూ గనుక అనుకుని ఉంటే దీన్ని సాధించేవారని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లాలూ ఇష్టపడలేదని మోదీ ఆరోపించారు. సరైన భాగస్వామ్య పక్షాలుంటే ప్రతిదీ సాధ్యమేనని పరోక్షంగా మోదీ నితీశ్ కుమార్ ను ప్రశంసించారు.    

2003లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కోసి రైల్వే బ్రిడ్జీ (మహావంతెన) నిర్మాణ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి రూ.516 కోట్లు కేటాయించింది. ఇక్కడి వలస కార్మికులు సైతం వంతెన నిర్మాణంలో పాల్పంచుకున్నారు. కరోనా సమయంలో బ్రిడ్జీ నిర్మాణం పూర్తయ్యింది. ఈ రైలు వంతెన ప్రారంభంతో బీహార్, తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పడింది.