చైనా దూకుడుకు, కశ్మీర్ విభజనకు సంబంధం లేదు

చైనా దూకుడుకు, కశ్మీర్ విభజనకు సంబంధం లేదు

సరిహద్దులో చైనా దూకుడుకు జమ్ముకశ్మీర్ రాష్ట్ర విభజనకు ఎలాంటి సంబంధం లేదని తాను నమ్ముతున్నట్లు విదేశాంగ మాజీ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. ఒక వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్, చైనా సరిహద్దులో ఆ దేశం దూకుడుగా ప్రవర్తిస్తున్నదన్న వాదనను ఆయన ఖండించారు. 

భారత్‌లో భాగమైన జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును పార్లమెంట్ గత ఏడాది ఆగస్టు 5న ఆమోదించిందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ అంతర్గత పునర్వ్యవస్థీకరణ చర్యల వల్ల ఆ రాష్ట్రంలోని బాహ్య సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు జరుగలేదని విజయ్ గోఖలే చెప్పారు. 

దీని వల్ల మన దేశం లేదా చైనా దేశం మ్యాపులలో కూడా కొత్తగా ఎలాంటి మార్పులు జరుగలేవని గుర్తు చేశారు. ఈ చర్య వల్లే లఢక్ సరిహద్దులో చైనా ఉద్రిక్తతలు పెంచుతుందన్న వాదన సరికాదని ఆయన తేల్చి చెప్పారు. 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతంలోని జిల్లాలను కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో భాగంగా పేర్కొంది. 

అయితే  పీవోకేలోని కొంత భాగాన్ని పాక్ 1963లో చైనాకు ఇచ్చింది. దీంతో గత ఏడాది ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న చర్యల వల్లనే సరిహద్దులో చైనా దూకుడు పెంచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గత ఏడాది ఆగస్టు 5 నాటి కేంద్రం చర్యకు, ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలకు సంబంధం లేదని విదేశాంగ మాజీ కార్యదర్శి విజయ్ గోఖలే తేల్చి చెప్పారు.