విమోచన దినోత్సవం ఆత్మగౌరవానికి సత్కారం

జి కిషన్ రెడ్డి, 
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి 
ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన 1947 ఆగస్టు 15న దేశమంతా మువ్వన్నెల రెపరెపలాడుతున్న సమయంలో, పోరాటఫలంగా లభించిన స్వాతంత్రయాన్ని చూసుకుని యావద్భారతం మురిపిసోతున్న చరిత్రాత్మక ఘట్టమది. దేశమంతా సంబరాలు జరుగుతున్న ఆ ఆనందభరిత క్షణాల్లో, నాటి హైదరాబాద్ రాష్ట్రం  బానిసత్వంలోనే మగ్గుతూ, సంతోషాన్ని అనుభవించలేని దుస్థితిలోనే కొనసాగుతూ అనేక దుర్మార్గాలను ఎదుర్కొంది. 

భారతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగినా కూడా 13 నెలల వరకు నియంతృత్వ, మతతత్వ నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దౌర్జన్యాలను, దాష్టీకాలను హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భరిస్తూనే ఉన్నారు. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన పోలీస్ యాక్షన్ కారణంగా 1948, సెప్టెంబర్ 17న నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం పొంది హైదరాబాద్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 

ఇంతటి చరిత్రాత్మక ఘట్టాన్ని స్మరిస్తూ, సెప్టెంబర్ 17న మరాఠ్వాడా ముక్తిసంగ్రామ్ దివస్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అధికారికంగా ఘనంగా జరుపుకుంటోంది. మహారాష్ట్రలో మరీ ముఖ్యంగా నిజాం పాలనలో ఉన్న మరాఠ్వాడా ప్రాంతంలో స్వాతంత్య్రం కోసం స్వామి రామానంద తీర్థ, గోవింద్‌భాయ్ ష్రాఫ్, వైజయంతి కాబ్రా, పీహెచ్ పట్వర్ధన్ వంటి మహానుభావులెందరో అవిరళంగా పోరాటం చేశారు. 

నిజాం రాజు ప్రైవేటు సైన్యమైన రజాకార్ల క్రూరత్వాన్ని భరిస్తూ, ఎదిరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ వాళందరూ తమ పోరాటాన్ని కొనసాగించారు. అదే విధంగా నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలైన బీదర్, కలబుర్గి, రాయ్‌చూర్ ప్రాంతాల విముక్తిని, నాటి వీరుల త్యాగాన్మి స్మరించుకుంటూ కర్ణాటక ప్రభుత్వం కూడా ‘హైదరాబాద్-–కర్ణాటక విమోచన దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 17న నిర్వహిస్తూ ఉత్సవాలు జరుపుకుంటోంది.

కానీ నా సొంతరాష్ట్రం, నిజాం రాజు పాలనాకేంద్రమైన తెలంగాణలో మాత్రం; నాటి పోరాటాన్ని, రజాకార్ల అకృ త్యాలను ఎదుర్కొంటూ నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించకపోవడం దురదృష్టకరం. 

కుమురం భీం, పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, షోయబుల్లాఖాన్, వందేమాతరం రామచంద్రారావు, నారాయణరావు పవార్, చాకలి ఐలవ్వ వంటి మహానుభావులెందరో తెలంగాణ విముక్తి, విమోచనం కోసం చూపిన శౌర్యం, చేసిన త్యాగం తరాలు మారుతున్న కొద్దీ మన స్మృతిపథం నుంచి చెరిగిపోయే ప్రమాదం కనబడుతోంది. 

పాఠ్యపుస్తకాల్లో, చారిత్రక కట్టడాల్లో, మన మనసుల్లో వీరికి సరైన స్థానం కల్పించకపోతే ఆ త్యాగాన్ని మనం అగౌరవపరిచినట్లే. 

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన హక్కని తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనేక మార్లు చెప్పింది. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చాకా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే విషయంలో మొహం చాటేసింది. 

దీనికి కారణం రాజకీయ పరమైన అంశాలేనన్నది సుస్పష్టం. ప్రభుత్వం తన రాజకీయ భాగస్వామి అయిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీకి ఉన్న భయానకమైన చరిత్రను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. మన దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో ఎంఐఎం పార్టీ నాయకుడైన ఖాసిం రిజ్వీ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం కానీయకుండా స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. 

దీనికోసం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఉన్న 24వేల సైన్యానికి తోడుగా లక్షా 50వేల మంది ప్రవేట్  సాయుధ ఆర్మీని జతపరిచాడు. ఆ తర్వాతే అది రజాకార్ల సైన్యంగా మారిపోయింది. ప్రత్యేక రాజ్యంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రజాకార్లు రెచ్చిపోయారు. 

అదే సమయంలో మహమ్మద్ అలీ జిన్నాతో చర్చలు జరిపి పాకిస్థాన్‌లో కలిసేందుకు కూడా ప్రయత్నించారు. గ్రామాలపై పడి దోచుకున్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేశారు, లెక్కలేనంత మందిని చంపేశారు. కంటికి కనిపించిన ప్రతిదాన్ని ధ్వంసం చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా నాటి రజాకార్లను, ఆ సిద్ధాంత మూలాలున్న ఎంఐఎం పార్టీ దుష్కృత్యాలను స్వతంత్రం కోసం పోరాటం చేసిన వేలాది అమరవీరుల చరిత్రను ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటారు.

తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛను పొందిన ఈ శుభతరుణాన్ని, చరిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్‌ 17న ఉత్సవం జరుపుకోవడమంటే, నాటి నిజాంను అవమానించడమేనని తద్వారా ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతింటాయని ఎంఐఎం పార్టీ వాదిస్తోంది. 

భారత రాజకీయాల్లో సంతుష్టీకరణ చాలా బలమైన ప్రమాదకరమైన ఆయుధం. అందులో భాగంగానే, భారతదేశంలో హైదరాబాద్ నిజాం రాజ్యం విలీనం కావాల్సిందేనంటూ రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన షోయబుల్లా ఖాన్ వంటి ముస్లిం జర్నలిస్టుల త్యాగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. 

చరిత్రలో నిలిచిపోయే అపూర్వఘట్టాన్ని ఉత్సవంగా జరుపుకోకపోవడం ద్వారా, స్వాతంత్ర్యం పొందడంతోపాటు భారత యూనియన్‌లో విలీనం కావాలన్న బలమైన కాంక్షతో హిందువులు, ముస్లింలు సంయుక్తంగా జరిపిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమాన పరుస్తోంది.

రజాకార్ల హింసకు సామాన్య తెలంగాణ పౌరులు దారుణంగా బలయ్యారు. వరంగల్ జిల్లాలోని భైరాన్‌పల్లిలో వందలమందిని కాల్చి చంపడం రజాకార్ల దుష్కృత్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే. రజాకార్లు కరీంనగర్‌కు తమ గ్రామం గుండా వెళ్లేందుకు భైరాన్‌పల్లి గ్రామస్థులు అనుమతించలేదు. దీంతో గ్రామంపై పడి వారి వికృతరూపాన్ని ప్రదర్శించారు. ఊరంతా లూటీ చేశారు. 

మహిళలు, చిన్నపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఊళ్లోని పురుషులందరినీ వరుసలో నిలబెట్టి వికటాట్టహాసం చేస్తూ తుపాకులతో కాల్చారు. కరీంనగర్ వెళ్లేంతవరకు దారిలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఇలాగే క్రూరంగా వ్యవహరించారు.

వరంగల్‌లోని పరకాల పట్టణం కూడా రజాకార్లను, నిజాం సైన్యాన్ని ప్రతిఘటించింది. ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న వార్త తెలియగానే ఉద్వేగభరితులైన పరకాలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. 

ఈ విషయం తెలిసి తట్టుకోలేకపోయిన రజాకార్లు పరకాల గ్రామంపై దాడికి తెగబడ్డారు. ఆడ, మగ, పిల్లా జెల్లా తేడా లేకుండా లాఠీలతో కనబడిన వాళ్లందరిపై విరుచుకుపడ్డారు. తుపాకులతో అనేక మందిని అత్యంత క్రూరంగా కాల్చేశారు. రంగాపురం గ్రామంలో ముగ్గురు పోరాటయోధులను చెట్టుకు కట్టేసి అత్యంత పాశవికంగా కాల్చి చంపారు. లక్ష్మీపురంలో మహిళలపై అత్యాచారం చేసి గ్రామంలో బంగారం, నగదు దోచుకున్నారు. 

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రంగాపురం, లక్ష్మీపురం గ్రామాల ఘటనలను దక్షిణ భారత ‘జలియన్ వాలాబాగ్‌’గా అభివర్ణించారు. నల్గొండ గుండ్రంపల్లిలో వందలమందిని చంపి బావిలో పడేశారు. నిర్మల్‌లో మర్రిచెట్టుకు వందల మందిని ఉరి తీసిన క్రూర ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇంతటి దారుణమైన చారిత్రక సత్యాలను మజ్లిస్ పార్టీ తొక్కిపెట్టాలని చూస్తోంది. వారి మాటలను రాష్ట్ర ప్రభుత్వం కూడా తుచ తప్పకుండా సంతోషంగా అమలు చేస్తోంది.

మన ప్రాంత చరిత్ర, భారతదేశంలో విలీనం కోసం జరిగిన పోరాటాలు, చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు, యువతకు తెలియజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడం చారిత్రక అవసరం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ద్వారా యువతరానికి మన ప్రాంత చరిత్రను గుర్తు చేసి ప్రేరణ కల్గించడం తెలంగాణా ప్రభుత్వం బాధ్యత. 

చరిత్రను, చారిత్రక సత్యాలను పాతిపెట్టడం ఓ వర్గాన్ని సంతుష్టీకరించడమే అవుతుంది. కనీసం సెప్టెంబర్ 17న తెలగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ, నాటి వీరుల త్యాగాలను స్మరిస్తూ, అమరవీరుల స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుచేయడం వారిని గౌరవించుకోవడంతోపాటు భవిష్యత్ తరాలు తెలంగాణ ప్రాంత శౌర్యప్రతాపాల గురించి తెలుసుకుని ప్రేరణ పొందేందుకు ఎంతో ఉపయుక్తమవుతుంది.

(ఆంధ్రజ్యోతి నుండి)