తమిళ హీరో సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు

తమిళనాడులో నీట్‌ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 
ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎపి సాహికి లేఖ రాశారు.  సూర్య చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. 
 
అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన ప్రకటన‌ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్‌ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్‌లో స్పందించారు. 
 
నీట్‌ పరీక్షల భయంతో తమిళనాడులో వారం కిందట నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల మరణం తనను మానసికంగా ఎంతో కలచి వేసిందని పేర్కొంటూ.. నటుడు సూర్య ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ఆ ప్రకటనలో ”కరోనా వ్యాప్తి నేపథ్యంలో గౌరవ న్యాయమూర్తులు తమ ప్రాణాల పట్ల భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ చేస్తూ తీర్పులు వెలువరిస్తున్నారు. కానీ నీట్‌ విషయంలో వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులను మాత్రం భయపడకుండా పరీక్షా కేంద్రాలకు వచ్చి నీట్‌ రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ఇవి ‘మనునీతి పరీక్షలు” అని పేర్కొన్నారు. 
 
సూర్య ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. అయితే సూర్య చేసిన తమిళ ప్రకటన అనువాదాన్ని న్యాయమూర్తి సుబ్రమణియం ప్రామాణికంగా తీసుకున్నారని, ఈ అనువాదంలో దోషాలు ఉన్నాయని, సూర్య చేయని వ్యాఖ్యలను అనువాద కాపీలో చేర్చారని హైకోర్టు మాజీ న్యాయమూర్తులు పలువురు పేర్కొన్నారు. 
 
సూర్యపై ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేస్తూ జస్టిస్‌ కె. చంద్రూ, జస్టిస్‌ కేఎన్‌ బాషా, జస్టిస్‌ సుదందిరం, జస్టిస్‌ హరిపద్మనాభన్‌, జస్టిస్‌ కె. కన్నన్‌, జస్టిస్‌ జీఎం అక్బర్‌ అలీ హైకోర్టు సీజేకి లేఖలు రాశారు.