ఏపీలో సహజ వాయువుపై పెరిగిన పన్ను  

రాష్ట్రంలో సహజ వాయువుపై వ్యాట్‌ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విలువు ఆధారిత పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ముడిసమురుపై 5శాతం, పెట్రోల్‌పై 31 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర పన్ను వసూలు చేస్తోంది. 
 
డీజిల్‌పై 22.5శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర, ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై ఒకశాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్‌ వసూలు చేస్తోంది. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10శాతం వ్యాట్‌ పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
2020 ఏప్రిల్‌ నాటికి రూ.4,480 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.1,323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో సమజవాయువుపై పన్ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.