ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్(80) గత రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
‘ఇవాళ అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని’ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబర్ 21న శ్రీకాకుళంలోని ఓ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆయన తాతగారి స్వగ్రామము ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయారు. ఫిలాసఫీ, న్యాయవాద కోర్సులు చదివినప్పటికీ సామాజిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు.
తాను చదివిన చదువుకు పరమార్ధం చేకూర్చే ఉద్దేశంతో సామాజిక సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారు. సన్యాసి జీవితాన్ని గడపడానికి ఆయన తన పేరు, కులం, మతం, కుటుంబం, ఆస్తులకు కూడా త్యజించారు. తన ఫౌండేషన్ బంధు ముక్తి మోర్చా(బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్) ద్వారా కార్మిక వ్యతిరేక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
1977లో హరియాణాలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రెండేళ్ల తర్వాత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నిరసన చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపిన పోలీసులపై హరియాణా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అగ్నివేశ్ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్య నిషేధం అమలు కోసం, గిరిజనులు, దళితుల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం ఉద్యమించారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ
కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే!