వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లు 

వలస కార్మికులు తిరిగి ఉపాధి దొరికే ప్రాంతాలకు వెళ్లేందుకు ఒడిశా నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన రైల్వేమంత్రికి లేఖ రాశారు. 

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు రైల్వే మే 1న శ్రామిక్‌ రైళ్లను ప్రారంభించగా, జూలై 9న చివరి రైలు నడించింది. ఒడిశాలోని వలస కార్మికుల నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయని, వారు తమను పని ప్రదేశాలకు చేరుకునేలా రైలు సేవలు ప్రారంభించాలని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పీయూష్‌ గోయల్‌ను కోరారు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండడంతో సాధారణ స్థితికి వస్తుండడంతో వలస కార్మికులు తిరిగి పని ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వలస కూలీలకు జీవనోపాధి అత్యవసరమని, దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఒడిశాలో నివసిస్తున్న కార్మికులు జీవనోపాధి దొరికే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు శ్రామిక్ స్పెషల్ రైళ్లను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని గోయల్‌ను ధర్మేంద్ర ప్రధాన్‌ కోరారు.

కాగా, ఒడిశా నుంచి డిమాండ్ మేరకు మరిన్ని రెగ్యులర్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రత్యేక రైళ్లను ఇతర రాష్ట్రాలు కోరలేదు. ప్రస్తుతం భారతీయ రైల్వే 230 ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఈ నెల 12 నుంచి అదనంగా మరో 80 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే ప్రకటించింది.